తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Margadashi Chits : పత్రికా ప్రకటనలు కుదరవు… వివరణ ఇవ్వాల్సిందే….

Margadashi Chits : పత్రికా ప్రకటనలు కుదరవు… వివరణ ఇవ్వాల్సిందే….

HT Telugu Desk HT Telugu

10 December 2022, 13:01 IST

google News
    • Margadashi Chits : మార్గదర్శి చిట్‌ఫండ్‌ కోరిన సమాచారాన్ని ఇవ్వకుండా ప్రకటనలు ఇస్తే పరిగణనలోకి తీసుకోలేమని ఏపీ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు. ఏ సంస్థ అయినా ప్రభుత్వానికి అవసరమైన సమాచారం ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో 35 చిట్‌ఫండ్ కంపెనీల్లో అవకతవకలను గుర్తించామని, ప్రతి సంవత్సరం  చిట్‌ఫండ్ కంపెనీల స్థితిగతులపై సమాచారం అందించాల్సిందేనని  తేల్చి చెప్పారు. 
ఏపీ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ఐజీ రామకృష్ణ
ఏపీ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ఐజీ రామకృష్ణ

ఏపీ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ఐజీ రామకృష్ణ

Margadashi Chits ఆంధ్రప్రదేశ‌‌లో 35 చిట్ ఫండ్ కంపెనీల్లో అవకతవకలను గుర్తించినట్లు స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ప్రకటించింది. ప్రతి సంవత్సరం చిట్ ఫండ్ కంపెనీల స్థితిగతులపై తప్పనిసరిగా సమాచారం అందించాలని, త్వరలో మార్గదర్శి చిట్‌ఫండ్‌ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చిట్ ఫండ్ కంపెనీల అవకతవకలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో నిర్వహించిన తనిఖీల్లో 35 చిట్ ఫండ్ కంపెనీల్లో అవకతకలను గుర్తించామని, వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ వి. రామకృష్ణ తెలిపారు. చిట్ ఫండ్స్ చట్టం ప్రకారం ప్రతి కంపెనీ ఆస్తులు, లయబిలిటీస్, ఖర్చులు, రిసీట్స్, ఇన్వెస్ట్ మెంట్స్, రిజర్వ్ ఫండ్స్ వంటి ఆరు రకాల సమాచారాన్ని ప్రతి సంవత్సరం అందివ్వాలన్నారు.

రాష్ట్రంలో దాదాపు 423 చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి 587 బ్రాంచ్ లున్నాయని, వీటిద్వారా రూ.638.99 కోట్ల వార్షిక టర్నోవర్ తో 6,868 చిట్ గ్రూప్ లు పనిచేస్తున్నాయన్నారు. సుమారు 2.48 లక్షల మంది చిట్ ఖాతాదారులున్నారని తెలిపారు. చిట్ ఫండ్ కంపెనీలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అధికారుల్లో కూడా చిట్ ఫండ్స్ చట్టంపై మార్గనిర్దేశకత్వం చేయడానికి వర్క్ షాపు నిర్వహించామని తెలిపారు.

చిట్‌ కంపెనీల్లో ఉల్లంఘనను ఎలా గుర్తించాలి, షోకాజ్ నోటీసు జారీ చేయడం, స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఎలా ఆడిట్ చేయాలి?, చెక్ లిస్ట్ తదితర అంశాలపై తరగతులు నిర్వహించామన్నారు. నిపుణులైన ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఆడిటర్లను సలహాదారులుగా నియమించుకున్నామని తెలిపారు. డీఆర్ఐ నుండి కూడా అధికారులు వచ్చి అవగాహన కల్పించారన్నారు.

మార్గదర్శి సంస్థలో నిబంధనల ఉల్లంఘనపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం తమకు సంబంధం లేదని ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారుర. ఏ సంస్థ అయినా ఎక్కడ బిజినెస్ చేస్తే అక్కడ రికార్డులు ఇవ్వాలన్నారు. చిట్ కంపెనీలు సెక్యూరిటీ పేరిట డిపాజిట్లను సేకరించడం, వడ్డీ సరిగా చెల్లించకపోవడం, ప్రత్యేక బ్యాలెన్స్ షీట్లు నిర్వహించకపోవడం వంటి అంశాలు తనిఖీల్లో గుర్తించామన్నారు. మార్గదర్శి మినహా అన్ని కంపెనీలు అడిగిన సమాచారం ఇస్తున్నాయని తెలిపారు.

మార్గదర్శి పై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆడిటర్స్, ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్స్ తో మార్గదర్శి హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి తనిఖీలు చేస్తామన్నారు. కంపెనీ ఫైనాన్సియల్ స్టేటస్ తెలుసుకోవడానికే వివరాలు అడిగామని, ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ చేస్తూ తెలంగాణ లేదా కర్ణాటకలో వివరాలు ఇస్తామనడం ఎంతవరకు సమజసమని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో సహకరించాల్సిన బాధ్యత మార్గదర్శి పై ఉందని ఐజీ రామకృష్ణ స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం