తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh : రేప‌టి నుంచి ప‌ల్లె పండుగ- పంచాయ‌తీ వారోత్స‌వాలు.. కంకిపాడులో ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

Andhra Pradesh : రేప‌టి నుంచి ప‌ల్లె పండుగ- పంచాయ‌తీ వారోత్స‌వాలు.. కంకిపాడులో ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

HT Telugu Desk HT Telugu

13 October 2024, 12:11 IST

google News
    • Andhra Pradesh : రాష్ట్రంలో రేప‌టి నుంచి ప‌ల్లె పండుగ‌- పంచాయ‌తీ వారోత్స‌వాలను నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 14 నుంచి 20 వ‌ర‌కు 7 రోజుల పాటు జ‌రిగే వారోత్స‌వాల్లో.. 13,326 గ్రామాల్లో రూ.4,500 కోట్ల‌తో 30 ర‌కాల ప‌నుల‌కు శంకుస్థాపాలు చేయ‌నున్నారు. సంక్రాంతి వరకు పూర్తి చేయనున్నారు.
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆధ్వ‌ర్యంలో వారోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ వారోత్స‌వాల‌ను డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడులో ప్రారంభిస్తారు. అక్క‌డ నిర్వ‌హించే వారోత్స‌వాల్లో ఆయ‌న పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో రూ.4,500 కోట్ల‌తో 30 వేల ప‌నుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టనుంది. అందులో రూ.1,250 కోట్లతో మొత్తం మూడు వేల కిలో మీట‌ర్ల మేర సీసీ రోడ్డు, 500 కిలోమీట‌ర్ల తారు రోడ్లు, వ్య‌వ‌సాయ కుంట‌లు, ప‌శువుల పాకలు, ఇంకుడు గుంత‌ల నిర్మాణం లాంటి ప‌నుల్ని చేపట్టనున్నారు.

13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించామ‌ని ఇటీవ‌లి వీడియో కాన్ఫ‌రెన్స్‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివరించారు. అందుకు వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నామ‌ని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 2,081 కోట్ల వేతన బకాయిలు జమ చేశామ‌ని వివరించారు. 2024-25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామసభల ఆమోదం తెలిపాయ‌ని, 30 వేల పనులకి పల్లె పండుగలో శ్రీకారం చుట్టామ‌ని అన్నారు.

పండుగ వాతావరణంలో..

గ్రామాల్లో నివాసం ఉంటున్న కుంటుంబాల‌కు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పన చేశామ‌ని పవన్ వ్యాఖ్యానించారు. ఈ 100 రోజుల్లో ఉపాధి హామీ కూలీల‌కు 466.13 ల‌క్ష‌ల ప‌నిదినాల‌ను క‌ల్పించామని చెప్పారు. 1.07 ల‌క్ష‌ల కుటుంబాల‌కు 100 రోజుల ప‌ని దినాలని పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజూరైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజ చేస్తున్నామన్న పవన్.. ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణాలు, సంక్రాంతికల్లా పూర్తి చేయడమే లక్ష్యమ‌ని స్పష్టం చేశారు.

ఎంపీడీవోల ఆధ్వర్యంలో..

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో పాల్గొంటారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కేటాయించిన ప‌నుల‌కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. రాష్ట్ర పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌ల్లె పండ‌గ‌- పంచాయ‌తీ వారోత్స‌వాలను నిర్వ‌హించ‌డంతో ఎంపీడీఓలు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హ‌ణ చేస్తున్నారు.

నిధులు విడుదల..

ప‌ల్లెపండ‌గ‌- పంచాయ‌తీ వారోత్స‌వాలు జ‌రుగనున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం 15వ ఆర్థిక సంఘ నిధుల‌ను విడుద‌ల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్ఎల్‌బీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి 15వ‌ ఆర్థిక సంఘం గ్రాంట్‌ల మొదటి విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు అన్‌టైడ్ గ్రాంట్లు మొత్తం రూ.395 కోట్లు, టైడ్ గ్రాంట్‌లు మొత్తం రూ.593 కోట్లు విడుద‌ల చేసింది.

ఈ నిధులు జీతాలు లేదా ఇత‌ర ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఖర్చుల కోసం ఉపయోగించ‌కూడ‌ద‌ని కేంద్రం స్పష్టం చేసింది. టైడ్ గ్రాంట్లు పారిశుధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్‌) స్థితి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, నీటి రీసైక్లింగ్, గృహ వ్యర్థాల శుద్ధితో సహా నీటి నిర్వహణ వంటి పనులకు ఖ‌ర్చు చేయాల‌ని వివరించింది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం