Telangana Police : హోంగార్డులు ఏం పాపం చేశారు.. 19వ తారీఖు వచ్చినా జీతాలు ఇవ్వరా?
Telangana Police : హోంగార్డులు.. పోలీస్ శాఖలో చిరుద్యోగులు. తక్కువ వేతనం వస్తున్నా.. ఇష్టంతో పని చేస్తారు. కానీ.. ఆ తక్కువ వేతనం కూడా సమయానికి ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. ఫస్ట్ తారీఖు అయిపోయి 18 రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆగస్టు నెల జీతం రాలేదని చెబుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ నెలఖారున గానీ.. ఒకటో తేదీన గానీ.. జీతాలు చెల్లిస్తారు. పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డులకు మాత్రం పదో తారీఖు లోపు వెతనాలు చెల్లిస్తారు. కానీ.. రెండు నెలలుగా తమకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదని హోంగార్డులు వాపోతున్నారు. పదో తేదీన బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిన జీతాలు ఇంకా రాకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని హోంగార్డులు చెబుతున్నారు.
ఆగస్టు నెల పూర్తయి 18 రోజులు గడుస్తున్నాయి. కానీ.. ఇంకా జీతాలు చేతికి అందలేదని హోంగార్డులు వాపోతున్నారు. పూట గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితిని ఉందని చెబుతున్నారు. పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తున్నామని చెబుతున్నారు. ఇంట్లో గడవడం కూడా కష్టంగా మారిందని కొందరు హోంగార్డులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
తెలంగాణలో 18 వేల మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో హోంగార్డుకు నెలకు రూ.28 వేల వేతనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సుమారు 450 మంది హోంగార్డులు మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలనూ చేపట్టడం లేదని వాపోతున్నారు. ఒక్కరోజు డ్యూటీకి దూరంగా ఉన్నా.. జీతంలో రూ.900 కట్ చేస్తున్నారని చెబుతున్నారు.
సిబ్బంది కొరత ఉన్నా.. చాలా చోట్ల వీరి సేవలనే వినియోగించుకుంటూ నెట్టుకొస్తున్నారు. ప్రముఖుల పర్యటనలు, పండుగలు, ఇతర సమయాల్లో అవసరమైన బందోబస్తుల్లో హోంగార్డులే ముందుంటారు. తాము కష్టపడి ఉద్యోగం చేస్తున్నామని.. సకాలంలో జీతాలు అందించాలని హోంగార్డులు కోరుతున్నారు. అయితే.. బడ్జెట్ కేటాయించకపోవడంతోనే రెండు నెలలుగా జీతాలు ఆలస్యం అవుతున్నాయని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.