Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు అప్‌డేట్ వ‌చ్చేసింది!-hollywood stunt master for pawan kalyan harihara veeramallu og ustaad bhagat singh updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు అప్‌డేట్ వ‌చ్చేసింది!

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు అప్‌డేట్ వ‌చ్చేసింది!

Nelki Naresh Kumar HT Telugu
Sep 20, 2024 02:10 PM IST

Pawan Kalyan: హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీపై మేక‌ర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను శుక్ర‌వారం రివీల్ చేశారు. సెప్టెంబ‌ర్ 23 నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మూవీ షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. హరిహరవీరమల్లుకు ఏఎమ్ జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్
ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan:హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సినిమా సెట్స్‌లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అడుగుపెట్టిదే ఎప్పుడో రివీల్ చేశారు. సెప్టెంబ‌ర్ 23 నుంచి హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీ షూటింగ్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరిగి మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లో జ‌రుగ‌నున్న లేటెస్ట్ షెడ్యూల్‌లో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ నిక్ పావెల్ సార‌థ్యంలో ఓ భారీ యుద్ద స‌న్నివేశం చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు వెల్ల‌డించారు.

నాలుగు వంద‌ల మంది ఆర్టిస్టులు...

ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు సీనియర్ నటులు నాజర్, రఘుబాబు, క‌మెడియ‌న్‌ సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప పి శ‌ర్మ కూడా భాగం కాబోతున్న‌ట్లు తెలిసింది. దాదాపు నాలుగు వంద‌ల మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు, ఫైట‌ర్ల‌తో మునుపెన్నడూ టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడని స్థాయిలో నెక్స్ట్ లెవెల్‌లో ఈ యుద్ధ సన్నివేశాల‌ను తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది.

విజ‌య‌వాడ షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోనున్న‌ట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌తోనే సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంద‌ని చెబుతోన్నారు.

బ్రేవ్ హార్ట్ గ్లాడియేట‌ర్‌...

గ‌తంలో నిక్ పావెల్ బ్రేవ్ హార్ట్‌, గ్లాడియేట‌ర్‌, బోర్న్ ఐడెంటిటీ, ది లాస్ట్ స‌మురాయ్‌, రెసిడెంట్ ఈవిల్ రిట్రిబ్యూష‌న్‌తో పాటు హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీస్‌కు ప‌నిచేశాడు. హాలీవుడ్‌లో ప‌లు భారీ బ‌డ్జెట్ మూవీస్‌కు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

అంత‌ర్జాతీయంగా స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ల‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్ ఐదు అవార్డులను గెలుచుకున్నాడు

ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో...

మొఘ‌లుల కాలం నాటి క‌థ‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో చారిత్రాత్మ‌క పోరాట యోధుడి పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. మొఘ‌ల్ రాజు ఔరంగ‌జేబును అన్యాయాల‌ను, అక్ర‌మాల‌ను ఎదురించే వీరుడిగా ప‌వ‌ర్‌ఫుల్‌గా ప‌వ‌న్ రోల్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

ద‌ర్శ‌కుడిగా ఏఎమ్ ర‌త్నం త‌న‌యుడు...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీకి సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎమ్ ర‌త్నం త‌న‌యుడు ఏఎమ్‌ జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా తొలుత క్రిష్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల క్రిష్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో సినిమాను పూర్తిచేసే బాధ్య‌త‌ను జ్యోతికృష్ణ చేప‌ట్టాడు.

బాబీడియోల్ విల‌న్‌...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు స్వార్ట్ వ‌ర్సెస్ స్పిరిట్ పేరుతో ఈ తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో యానిమ‌ల్ ఫేమ్ బాబీ డియోల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న ఈ సినిమాలో కీల‌క పాత్రను అనుప‌మ్ ఖేర్ చేస్తోన్నాడు. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి మ్యూజిక్ అందించ‌నున్నాడు.

ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాను నిర్మిస్తున్నాడు. హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.

ఓజీ...ఉస్తాద్ భ‌గ‌త్‌...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలు చేస్తోన్నాడు. ఓజీ సినిమాకు సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌కు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా షూటింగ్‌ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడు పాల్గొనేది త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.