TG Residential Complex: దసరా కానుక...యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు భూమిపూజకు ఏర్పాట్లు
TG Residential Complex: కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు శ్రీకారం చుడుతుంది. దసరా కానుకగా భూమి పూజకు సిద్ధమైంది.వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవనాల నిర్మాణం పూర్తిచేసి క్లాసులు ప్రారంభించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
TG Residential Complex: దసరా పండుగ కానుకగా పేద మధ్యతరగతి విద్యార్థులకు అదునాతన సౌకర్యాలతో మెరుగైన విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు దసరా పండుగ సందర్భంగా భూమి పూజ చేసి వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు.
కరీంనగర్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్... తొలి విడతలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు హుస్నాబాద్, మానకొండూర్, మంథని, ధర్మపురి లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.
ఒక్కy రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కు రూ.180 కోట్లతో భవనాల నిర్మాణం, మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకుల పంపిణీ
కరీంనగర్ సమీపంలోని మానేర్ ఒడ్డున రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి తో కలిసి గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకుల పంపిణీ చేశారు.
గీత కార్మికులకు రక్షణగా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన వారితో సాంకేతికంగా NIT అప్రూవల్ జరిగిన కాటమయ్య సేఫ్టీ కిట్ తయారు చేయడం జరిగిందన్నారు. 1500 కిలోల బరువులను తట్టుకునే విధంగా ఈ సేఫ్టీ కిట్ తయారు చేయడం జరిగిందన్నారు.
గీతా కార్మికులు తాటి చెట్టు ఎక్కిన వారి ప్రాణాలు రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మొదటి దశలో హైదరాబాద్ మినహా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 వేల కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రిజిస్టర్ అయిన 2 లక్షల మంది గీతా కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. భవిష్యత్ లో తాటి చెట్టు పై నుంచి గీతా కార్మికులు పడిపోయారనే మాట వినపడకూడదన్నారు. కొన్ని కుల సంఘాలకు కార్పొరేషన్లు, ఉపాధి అవకాశాలు... msme పాలసీలో కుల సంఘాల అంశాలు చెరుస్తున్నామని తెలిపారు.
డంపింగ్ యార్డు తరలించాలి
మానేరు ఒడ్డున రేణుక ఎల్లమ్మ ఆలయం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ ను వెంటనే వేరే చోటకు తరలించాలని కలెక్టర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మానేర్ రివర్ ఫ్రంట్ తో ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా మారుస్తున్న నేపథ్యంలో డంపింగ్ యార్డను వెంటనే షిఫ్ట్ చేయాలని అందుకు సరైన స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు.
రావణ కాష్టంలా నిత్యం డంపింగ్ యార్డ్ కాలుతుండడంతో విషవాయువులతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డంపింగ్ యార్డును తక్షణ కర్తవ్యంగా తరలించాలని ఆదేశించారు. ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా టవర్ సర్కిల్ ప్రాంతంలోని దుర్గాభవాని మండపాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)