Balineni Srinivas : రాజకీయాల్లో సర్దుకుపోయి ఇబ్బందులు పడ్డా, ఈ ఎన్నికల్లోనే చివరి పోటీ- బాలినేని సంచలన వ్యాఖ్యలు
28 February 2024, 17:18 IST
- Balineni Srinivas : ఈ ఎన్నికలే తన చివరి పోటీ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలవ వ్యాఖ్యలు చేశారు. మాగుంట ఎంపీ సీటు కోసం చాలా ప్రయత్నించానన్నారు. రాజకీయాల్లో సర్దుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డానన్నారు.
రాజకీయాల్లో సర్దుకుపోయి ఇబ్బందులు పడ్డా-బాలినేని
Balineni Srinivas : ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలే తనకు చివరి పోటీ అని బాలినేని అన్నారు. రాజకీయాల్లో సర్దుకుపోయి ఇబ్బందులు పడుతున్నానన్నారు. అవసరమైతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను(CM Jagan) ఏదైనా అడిగితే వాసు అలిగాడని అంటున్నారని, తాను ప్రజలు కోసమే అలిగానన్నారు. 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని హైదరాబాద్‌లో కూర్చున్నానని చెప్పారు. ప్రజల్లో ఏం జరుగుతోందో సీఎంకు చెప్పకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు. సీఎం దగ్గర అందరిలాగా డబ్బాలు కొట్టకుండా వాస్తవాలు చెబుతున్నానన్నారు.
ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకంగా
ఎంపీ మాగుంట(MP Magunta Srinivasulu Reddy) వైసీపీకి రాజీనామా చేశారు. మాగుంట రాజీనామాపై స్పందిస్తూ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని పోరాడానని బాలినేని అన్నారు. సాధ్యం కాకపోవడంతో సర్దుకుపోయానన్నారు. పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం తనది కాదన్నారు. ఈ ఎన్నికల్లో చివరిసారిగా పోటీ చేస్తున్నానన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని, సీఎంతో గతంలో చర్చించానన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు త్వరలోనే చెల్లిస్తారన్నారు. ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుకి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం జగన్ దగ్గర గట్టిగా పోరాడతానన్నారు.
వైఎస్ఆర్ మాటలే స్ఫూర్తి
మాగుంట రాజీనామా చేసిన తర్వాత కూడా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఆయనతో కలసి ఆ కార్యక్రమానికి తాను హాజరయ్యానని బాలినేని తెలిపారు. ఈ విషయంపై రేపు కొందరు వివాదం చేస్తారన్నారు. తనకు చిత్తశుద్ది ఉందని, ఆ మేరకే రాజకీయాలు చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. రాజకీయాల్లో చిన్న తప్పు చేసినా సరిదిద్దుకోవటానికి చాలా సమయంలో పడుతుందని వైఎస్ఆర్(YSR) చెప్పిన మాటలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. పార్టీకి ద్రోహం చేయకూడదు, ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని వైఎస్ఆర్ చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి అన్నారు.
వైసీపీకి మాగుంట రాజీనామా
గత కొంతకాలంగా వైసీపీ విధానాలపై అసంతృప్తితో ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన మాగుంట శ్రీనివాసులరెడ్డి....ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అన్నారు. త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు. అన్నీ విషయాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోందని అన్నారు. మా కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారని వెల్లడించారు. ప్రకాశం జిల్లా(Prakasam)లో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని, 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానన్నారు. మాగుంట కుటుంబానికి ఎప్పుడూ అహం లేదన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నామన్నారు. అయితే ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని(Magunta Raghava Reddy) నిలపాలని నిర్ణయించామని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు.