Ysrcp MP Magunta Resign : వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై- 6కు చేరిన ఎంపీ రాజీనామాలు-prakasam news in telugu ongole mp magunta srinivasulu reddy resigned to ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Mp Magunta Resign : వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై- 6కు చేరిన ఎంపీ రాజీనామాలు

Ysrcp MP Magunta Resign : వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై- 6కు చేరిన ఎంపీ రాజీనామాలు

Bandaru Satyaprasad HT Telugu
Feb 28, 2024 02:10 PM IST

Ysrcp MP Magunta Resign : ఏపీలో అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. మాగుంట రాజీనామాతో ఇప్పటి వరకూ వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య ఆరుకు చేరింది.

వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై
వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై

Ysrcp MP Magunta Resign : ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైసీపీకి గట్టి షాక్ లు తగులుతున్నాయి. టికెట్లు రాని నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని విడగా...తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి(MP Magunta Srinivasulureddy) వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ ఐదుగురు లోక్ సభ, ఒక రాజ్యసభ ఎంపీ వైసీపీని(Ysrcp) విడారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు నెల్లూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీని విడారు.

yearly horoscope entry point

ఎంతో బాధతో రాజీనామా

గత కొంతకాలంగా వైసీపీ విధానాలపై అసంతృప్తితో ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన మాగుంట శ్రీనివాసులరెడ్డి....ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అన్నారు. త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు. అన్నీ విషయాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోందని అన్నారు. మా కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారని వెల్లడించారు. ప్రకాశం జిల్లా(Prakasam)లో మాగుంట అంటే ఒక బ్రాండ్‌ అని, 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానన్నారు. మాగుంట కుటుంబానికి ఎప్పుడూ అహం లేదన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నామన్నారు. అయితే ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని(Magunta Raghava Reddy) నిలపాలని నిర్ణయించామని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు.

త్వరలో టీడీపీలోకి!

వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తారని శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. ఆత్మగౌరవ సమస్య వల్లే వైసీపీని వీడుతున్నామన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి త్వరలో టీడీపీలోచేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కుమారుడు రాఘవరెడ్డికి టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో స్పష్టం వచ్చే అవకాశం ఉంది. రాఘవరెడ్డి ఎంపీ టికెట్ పై టీడీపీ అధిష్టానం నుంచి హామీ లభించిన తర్వాతే వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కేటాయించేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంటకు సీటు ఇప్పించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో... ఇన్నాళ్లు వేచిచూచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన ఒకటి రెండు రోజుల్లో టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం