AP Anganwadi Jobs 2024 : అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు దాఖలుకు ఈనెల 18 ఆఖరు తేదీ
10 December 2024, 11:39 IST
- AP Anganwadi Jobs 2024 : అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలకు డిసెంబర్ 18 ఆఖరు తేదీగా నిర్ణయించారు. వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 56 అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులను పదో తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు.
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పల్నాడు జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు నాలుగు మండలాల్లో మొత్తం 21 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో అంగన్‌వాడీ వర్కర్ (ఏడబ్ల్యూడబ్ల్యూ) పోస్టులు-2, అంగన్‌వాడీ హెల్పర్ (ఏడబ్ల్యూహెచ్) పోస్టులు-19 భర్తీ చేస్తున్నారు.
చికలూరిపేటలోని నాదెండ్ల మండలంలో మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో అంగన్‌వాడీ వర్కర్ (ఏడబ్ల్యూడబ్ల్యూ) పోస్టులు-1, అంగన్‌వాడీ హెల్పర్ (ఏడబ్ల్యూహెచ్) పోస్టులు-12 భర్తీ చేస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల, మాచవరం రెండు మండలాల్లో 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో అన్ని అంగన్‌వాడీ హెల్పర్ (ఏడబ్ల్యూహెచ్) పోస్టులు-12 భర్తీ చేస్తున్నారు.
వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి, ఈపూరు రెండు మండాలాల్లో ఆరు పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో అన్ని అంగన్‌వాడీ హెల్పర్ (ఏడబ్ల్యూహెచ్) పోస్టులు-6 భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు. ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయొచ్చు. అర్హత ఉన్నవారు డిసెంబర్ 16 తేదీలోపు సంబంధిత సీడీపీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు..
అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగాలకు పదో తరగతి పూర్తి చేయడం తప్పని సరి. అంగన్‌వాడీ సహాయకురాలు ఉద్యోగాలకు ఏడో తరగతి చదివిన వారు అర్హులు. కనీస వయస్సు 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లుయితే.. 18 సంవత్సరాలు నిండిన వారి అప్లికేషన్ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
జీతం..
అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.11,500, అంగన్‌వాడీ సహాయకులకు రూ.7,000 జీతం ఉంటుంది. ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి పరీక్ష లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీవో కార్యాలయాల్లో తమ అప్లికేషన్ అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యా అర్హత, ఇతర సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అప్లికేషన్ అందజేయాలి.
కావాల్సిన పత్రాలు..
1.బర్త్ సర్టిఫికెట్
2.పదో తరగతి మెమో
3.కుల ధువ్రీకరణ పత్రం
4.స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం
5. వివాహితురాలైతే వివాహ ధ్రువీకరణ పత్రం
6.అనుభవం ఉంటే, అనుభవ పత్రం
7.దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్
8.వితంతువులతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)