Rameshwaram Cafe Blast Case : రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం..! ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్
22 May 2024, 15:35 IST
Rameshwaram Cafe blast case Updates : రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ(NIA)… అనంతపురం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను మంగళవారం అరెస్టు చేసింది.
రామేశ్వరం కేఫ్ బ్లాస్ కేసులో కీలక పరిణామం
Rameshwaram cafe blast case Updates : రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా… మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో సోదాలు చేపట్టింది.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్….
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ప్రకటించింది.
రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధిలోని నాగులబావి ప్రాంతంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్ గఫూర్ నివాసం ఉంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఎన్‌ఐఏ అధికారులు ఈ ఇంటిపై దాడులు నిర్వహించారు. పేళ్లుళ్లకు పాల్పడిన వారితో సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు.
"గత మూడు రోజులుగా రాయదుర్గం ప్రాంతంలోనే ఎన్ఐఏ అధికారులు రెక్కీ నిర్వహించారు. మంగళవారం రిటైర్డ్ హెడ్ మాస్టర్ గఫూర్ కుమారుడు సోహెల్ ను విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు, ”అని అనంతపురం జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి ఆఫ్ ది రికార్డుగా తెలిపారు. ఎన్ఐఏ అధికారులకు స్థానిక పోలీసులు సాకారం అందించారని పేర్కొన్నారు.
30 ఏళ్ల వయసు గల యువకుడు(సోహెల్) తన అన్నయ్యతో కలిసి బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతని బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో నగదు జమ అయినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. డబ్బలు జమ కావటంతో పాటు మరికొంత సమాచారం సేకరించిన దర్యాప్తు సంస్థ… సోహెల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించి 10 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు నిందితులు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలను ఎన్‌ఐఏ ఏప్రిల్ 12న అరెస్టు చేసింది.
సోహెల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రాథమిక విచారణ అనంతరం బెంగళూరుకు తరలించారు. "సోహైల్ అరెస్టు గురించి ఎన్ఐఏ అధికారులు తండ్రి గఫూర్ తో పాటు కుటుంబ సభ్యులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు" అని పైన పేర్కొన్న పోలీసు అధికారి చెప్పారు.
సోహెల్ ఇంటిపై సోదాలు చేసిన ఎన్ఐఏ… అతనిడి మొబైల్, ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోహెల్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడుకు సంబంధించి నిందితుల సమాచారం ఇచ్చిన వారికి ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఇన్ఫార్మర్ల గుర్తింపులో గోప్యతను పాటిస్తామని ఏజెన్సీ స్పష్టం చేసింది.
కొద్దిరోజుల కిందట బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ లో బ్యాగ్ ను ఉంచుతున్న సమయంలో సీసీటీవీ కెమెరా ఫుటేజీలో రికార్డయిన బాంబర్ చిత్రాన్ని కూడా ఏజెన్సీ విడుదల చేసింది. ఎన్ఐఏ విడుదల చేసిన ఫొటోలో బాంబర్ టోపీ, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూస్ ధరించి ఉన్నాడు. అతని (బాంబర్) అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇచ్చినవారికి బహుమతి ఇస్తామని ఎన్ఐఏ ఆ పోస్టులో పేర్కొంది.
మార్చి 1వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు పేలుడు సంభవించిందని, కేఫ్ లోపల బ్యాగును ఉంచిన ఓ అనుమానితుడిని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. టైమర్ తో కూడిన ఐఈడీ పరికరాన్ని పేలుడుకు ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.