తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Political Consultants: కన్సల్టెంట్లతో పార్టీలకు కొత్త చిక్కులు.. పని ఒకరిది, ప్రచారం ఇంకొకరిది!

Political Consultants: కన్సల్టెంట్లతో పార్టీలకు కొత్త చిక్కులు.. పని ఒకరిది, ప్రచారం ఇంకొకరిది!

Sarath Chandra HT Telugu

11 July 2023, 8:53 IST

google News
    • Political Consultants: ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ కన్సల్టెంట్ల చాలా కాలం క్రితమే మొదలైంది.  అన్ని ప్రధాన పార్టీలు  కన్సల్టెంట్లుగా పిలుచుకునే వ్యూహకర్తల్ని నియమించు కున్నాయి. పార్టీలు ఏవైనా అన్ని విషయాల్లో పెత్తనం  కన్సల్టెంట్ల చేతిలోకి వెళ్లడం అయా పార్టీలోని  నాయకుల్ని మాత్రం చికాకు పెడుతోంది. 
రాజకీయ పార్టీలకు కన్సల్టెంట్లతో కొత్త చిక్కులు
రాజకీయ పార్టీలకు కన్సల్టెంట్లతో కొత్త చిక్కులు

రాజకీయ పార్టీలకు కన్సల్టెంట్లతో కొత్త చిక్కులు

Political Consultants: కన్సల్టెంట్లు ఎవరంటే.. “మీ చేతి గడియారంలో సమయాన్ని చూసి మీకు చెప్పవాళ్లనే కన్సల్టెంట్లు” అంటారని ఓ చలోక్తి ఉంది. ఏపీలో రాజకీయ పార్టీలకు సేవలందించే వాటికి ఇది అతికినట్టు సరిపోవచ్చు. ఒకప్పుడు వ్యాపారాలకు పరిమితమైన కన్సల్టెన్సీ సేవలు రాజకీయాల్లోకి కూడా వేగంగా వచ్చేశాయి. ఏపీలో 2019 ఎన్నికలకు ముందు రాజకీయాల్లో ఈ తరహా కన్సల్టెంట్ల సేవలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు రెండు తమ పార్టీలను గెలుపు బాట పట్టించడానికి కన్సల్టెంట్లను నియమించుకున్నాయి.

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ మళ్లీ గెలుపు కోసం ఐపాక్‌ సేవలు వినియోగించుకుంటోంది. 2019 ఎన్నికల విజయం ఐపాక్ పాత్ర గణనీయంగా ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ బలంగా నమ్మడంతో రెండోసారి కూడా ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.

ఇక తెలుగు దేశం పార్టీకి ఒకప్పటి ఐపాక్ బృందంలోని రాబిన్ శర్మ నేతృత్వంలోని షో టైమ్ కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ బృందంలోని సభ్యుడైనా రాబిన్ శర్మ బృందం దాదాపు రెండేళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలన్ని ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెంట్ల చెప్పు చేతల్లో నడుస్తున్నాయి. ప్రధాన పార్టీలు రెండు తమ రాజకీయ వ్యూహ రచన బాధ్యతలు కన్సల్టెంట్లకు అప్పగించి ఎత్తుగడలు రచించే పని అప్పగించేయడంతో ఏపీలో ఎన్నికల హడావుడి కొద్ది నెలల క్రితమే మొదలైపోయింది.

సాంప్రద్రాయక రాజకీయాలకు కాలం చెల్లి, కన్సల్టెంట్ల హవా నడుస్తుండటంతో ఏపీలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. పోటాపోటీగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ కన్సల్టెంట్ల వల్ల పార్టీలకు ఒరిగే ప్రయోజనం ఎంతో తెలియదు కానీ ఒక్కో పార్టీ డబ్బును లెక్క చేయకుండా వెదజల్లుతోంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీ రాజకీయాలు పొలిటికల్ కన్సల్టెంట్ల కను సన్నల్లోనే నడుస్తున్నాయి. సాంప్రదాయక మాధ్యమాలలో వార్తల్ని కూడా ఈ కన్సల్టెన్సీలు ప్రభావితం చేస్తున్నాయనే ప్రచారం కూడా బలంగా ఉంది. ఐదేళ్ల క్రితం టీడీపీ హయంలో ఏపీలో కన్సల్టెన్సీల సేవలు మొదలయ్యాయి. నిజానికి ఈ సంస్థలు చేసే పని తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అనేట్టు వాటి తీరు ఉండేది. అధికారం పీఠం మీద నుంచి టీడీపీ తప్పుకోగానే మరో కన్సల్టెన్సీ సంస్థ తెరపైకి వచ్చింది.

అప్పుడు ఇప్పుడు సేమ్ టూ సేమ్….

చంద్రబాబు హయంలో ప్రభుత్వానికి ప్రచారం కల్పించడానికి అంతర్జాతీయ బ్రాండ్‌తో ఓ కన్సల్టెన్సీకి నెలకు మూడున్నర కోట్లు చెల్లించి నియమించుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమకు తాము చేసుకున్న ప్రచారాన్ని కూడా ఈ సంస్థ తన ఖాతాాలో వేసుకునేదనే ఆరోపణలు ఉన్నాయి. రోజువారీ నివేదికల్లో తమ ప్రమేయం లేని అంశాలను కూడా తామే ప్రభావితం చేసినట్లు చెప్పుకుని అప్పటి ముఖ్యమంత్రి మెప్పు పొందేవి. ఏడాదికి దాదాపు రూ.30కోట్ల రుపాయలు ఈ కన్సల్టెన్సీకి ప్రభుత్వం చెల్లించేది. అదే సమయంలో ఎన్నికల ఏడాది ప్రభుత్వ బడ్జెట్ మొత్తం ఆ సంస్థ కనుసన్నల్లోనే కేటాయింపులు చేసింది.

ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో సాగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం ఒకటికి రెండు కన్సల్టెన్సీలను నియమించుకుంది. జాతీయ స్థాయిలో ప్రచారం కోసం రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో ఒకటి పిఆర్‌ సంస్థ కాగా మరొకటి జాతీయ స్థాయి మీడియా సంస్థగా సమాచారం. వీటి సేవల కోసం ప్రభుత్వం నుంచి ఎంత చెల్లిస్తున్నారనే అధికారిక లెక్కలు లేవు. ప్రచార కార్యక్రమాలతో పాటు సర్వేలు నిర్వహించే బాధ్యతలు కూడా వాటికి అప్పగించారు. మరోవైపు పార్టీ తరపున ఐపాక్ సేవలు వాడుకుంటోంది.

తెలుగుదేశం పార్టీలోను అవే చిక్కులు….

అటు తెలుగుదేశం పార్టీకి మరో రకమైన సమస్యలు ఉన్నాయి. టీడీపీలో ఉన్న సొంత ప్రచార విభాగాన్ని మొదట్నుంచి పటిష్టంగా నిర్వహిస్తుంటారు. పబ్లిసిటీ, పిఆర్ బాధ్యతల కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ పనిచేస్తుంటుంది. ప్రచారం , పబ్లిక్ రిలేషన్స్ వ్యవహారాల్లో టీడీపీ చాలా కాలం క్రితమే ఆరితేరింది.

మీడియా విభాగాల్లో పనిచేసిన సీనియర్ల పర్యవేక్షణలో అక్కడ వ్యవహారాలు సాగుతుంటాయి. పొలిటికల్ కన్సల్టెన్సీ సేవల్ని వినియోగించుకోవడం మొదలయ్యాక అక్కడ కొత్త సమస్యలు మొదలయ్యాయి. టీడీపీ ప్రచార విభాగం, పబ్లిసిటీ విభాగాలు చేపట్టే కార్యక్రమాలను కూడా కన్సల్టెంట్లు తమ ఖాతాలో వేసుకోవడం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి ఉంది. కష్టం ఒకరిదైతే దానిని మరొకరు క్లెయిమ్ చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అంతా తమ వల్లేనని ప్రచారం….

ఈ రకమైన పరిస్థితి వైసీపీలో కూడా ఉంది. వైసీపీ తరపున పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే మీడియా విభాగం, ప్రభుత్వ కార్యక్రమాలకు సమాచార శాఖ, సోషల్ మీడియా ప్రచారానికి డిజిటల్ కార్పొరేషన్ వంటివి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరి ప్రమేయం లేకుండా జరిగే ప్రచారాన్ని కూడా కన్సల్టెంట్లు తమ ఖాతాల్లో వేసుకుని క్రెడిట్ కొట్టేస్తుండటం పార్టీల పెద్దలు గమనించడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పత్రికల్లో టీవీల్లో వచ్చే రోజు వారీ కథనాలు, అయా పార్టీలకు అనుకూలంగా వచ్చే వార్తలు కూడా తమ చాతుర్యం వల్లేనని చెప్పుకోవడం వీటికి అలవాటై పోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిణామాలపై కోట్లు ఖర్చు చేస్తోన్న అయా పార్టీల పెద్దలుమేల్కొంటారో లేదో కాలమే నిర్ణయించాలి.

తదుపరి వ్యాసం