తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp: రాజ్యసభలో వైసీపీ బలం నిలుస్తుందా.. మోపిదేవి, బీద మస్తాన్‌రావు బాటలో మరో ఆరుగురు!

YSRCP: రాజ్యసభలో వైసీపీ బలం నిలుస్తుందా.. మోపిదేవి, బీద మస్తాన్‌రావు బాటలో మరో ఆరుగురు!

30 August 2024, 7:25 IST

google News
    • YSRCP: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజ్యసభలో టీడీపీని ఖాళీ చేశామని చెప్పిన వైసీపీ.. ఇప్పుడు తనకున్న సభ్యులను కాపాడుకోవడానికి కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోంది. అయినా.. ఎంత మంది మిగులుతారనేది ప్రశ్నగానే మిగిలి ఉంది.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ పని అయిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ రోడ్డెక్కి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కేడర్ ఎలాగూ జగన్‌ కోసమే ఉంటుంది కాబట్టి వాళ్లు కూడా కాస్త యాక్టివ్ అయ్యారు. కానీ.. లీడర్లు మాత్రం అంత ఈజీగా రోడ్డెక్కడం లేదు. పైగా పక్క చూపులు చూస్తున్నారు. దీంతో వారిని కాపాడుకోవడం కష్టంగా మారింది.

వైసీపీకి రాంరాం..

తాజాగా.. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి రాంరాం చెప్పారు. తమ రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. వారు రాజీనామా సమర్పించిన గంటల వ్యవధిలోనే.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. ఈ వ్యవహారంలో ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితిలో వైసీపీ ఉండిపోయింది. కనీసం వారు రాజీనామా చేయకుండా ఆపే ప్రయత్నం కూడా చేయలేదు.

వీరిద్దరి బాటలో మరికొందరు..

మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే పక్షాలే అధికారంలో ఉన్నాయి. దీంతో టీడీపీలో చేరితే.. రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో.. వీరిద్దరి బాటలోనే మరో ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు నడవనున్నట్టు తెలిసింది. అదే జరిగితే.. వైసీపీ బలం చాలా తగ్గుతుంది. వైసీపీకి రాజ్య సభలో మొత్తం 11 మంది సభ్యుల బలం ఉండేది. ఈ ఇద్దరి రాజీనామాతో అది 9కి తగ్గింది. ప్రచారం జరుగుతున్నట్టు మరో ఆరుగు రాజీనామా చేస్తే.. వైసీపీ బలం 3కు తగ్గే అవకాశం ఉంది.

మొత్తం 11 స్థానాల్లో..

2019లో రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లో వైసీపీ నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. సంఖ్యా బలం పరంగా చూస్తే.. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫలితాలు వచ్చిన ఏడాది కాకముందే ఇద్దరు రాజీనామా చేయడంతో.. ఎంత మంది వైసీపీలో ఉంటారనే చర్చ జరుగుతోంది. అటు టీడీపీ కూడా రాజ్యసభ సభ్యులపైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే మరికొందరు టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.

2030 వరకూ..

వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ షెడ్యూల్ ఏప్రిల్ 1, 2030 వరకు ఉంది. ఆళ్ల అయోధ్య రామి రెడ్డి, పరిమళ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా ముగ్గురు సభ్యుల పదవీ విరమణ జూన్ 21, 2026న ముగుస్తుంది. ఎస్. నిరంజన్ రెడ్డి, వి. విజయసాయి రెడ్డి, కృష్ణయ్య జూన్ 2028లో పదవీ విరమణ చేయనున్నారు. మిగిలిన సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి, మేడా రఘునాధ రెడ్డి, గొల్ల బాబూరావు ఏప్రిల్ 2030లో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ కాలం ఇంకా ఉన్నా.. నేతలు వేరే పార్టీల్లో చేరే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.

తదుపరి వ్యాసం