AP Free Electricity : 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన
04 December 2024, 18:45 IST
AP Free Electricity : ఎస్సీ, ఎస్టీలకు అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన
ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది చేకూరుస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేలా ఉచిత విద్యుత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని దళిత, గిరిజన సోదరులు నమ్మవద్దని కోరారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ వినియోగానికి 200 యూనిట్లు కటాఫ్ గా ఈ పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దళిత, గిరిజనులకు ఉచిత విద్యుత్ పథకాన్ని మొదటిసారిగా టీడీపీ ప్రభుత్వమే అమలు చేసిందని గుర్తుచేశారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి ఎస్సీ, ఎస్టీలందరూ అర్హులనని స్పష్టం చేశారు. ఈ పథకం విధివిధానాలపై లబ్ధిదారుల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే 1912కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.
ఉచిత విద్యుత్ పై దుష్ప్రచారం
గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అంధకారంలోకి నెట్టిందని మంత్రి రవి కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని తిరిగిగాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. అల్పాదాయ వర్గాలకు అమలు చేస్తు్న్న ఉచిత విద్యుత్ పథకానికి అడ్డంకులు సృష్టించేందుకు కొందరు అపోహలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం దళిత, గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలు చూసి నిరాశతో వైసీపీ తన అనుబంధ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు రాతలు రాయిస్తుందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పది వేల మందికి కొత్తగా అమలు
కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తమని, లబ్దిదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా 10547 మంది లబ్దిదారులకు ఉచిత విద్యుత్ పథకానికి అర్హత సాధించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరు అంచెల కోత విధానం వల్ల అర్హులైన చాలా మంది సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోయారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. అటువంటి వారిని గుర్తించి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు.
విద్యుత్ కేంద్రాల్లో కుల ధ్రువీకరణ పత్రం సమర్పణ
అర్హత ఉండి ఈ పథకం వర్తించకపోతే పలు మార్గదర్శకాలు పాటించాలని విద్యుత్ శాఖ సూచిస్తుంది. అర్హులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాలు లేదా విద్యుత్ కార్యాలయాల్లో కుల ధ్రువీకరణ పత్రం అందిస్తే ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఎప్పటిలాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుందన్నారు. అర్హులు ఈ విషయాన్ని గమనించి వెంటనే విద్యుత్ కార్యాలయాల్లో కులధ్రువీకరణ పత్రం అందించాలన్నారు.