తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : నేరుగా తలపడే దమ్ము లేకే దిల్లీలో పొత్తులు- చంద్రబాబు, పవన్ పై సీఎం జగన్ పంచులు

CM Jagan : నేరుగా తలపడే దమ్ము లేకే దిల్లీలో పొత్తులు- చంద్రబాబు, పవన్ పై సీఎం జగన్ పంచులు

10 March 2024, 18:03 IST

google News
    • CM Jagan : మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పేరు చెబితే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు. అందుకే దిల్లీలో గడపగడపకూ తిరిగి పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

CM Jagan : సిద్ధం(Siddham) అంటే ప్రజాసముద్రం, ప్రజలు చేసే యుద్ధం అని సీఎం జగన్ అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల సిద్ధం చివరి సభలో పాల్గొన్న సీఎం జగన్(CM Jagan)... ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర, తనది అర్జునుడి పాత్ర అన్నారు. జమ్మిచెట్టుపై ఇన్నాళ్లు దాచిన ఓటు అస్త్రాన్ని పెత్తందార్లపై ప్రయోగించాలని కోరారు. చంద్రబాబు(Chandrababu)లాగా తనకు నటించే పొలిటికల్‌ స్టార్‌ క్యాంపెయినర్లు లేరని, ఎల్లో మీడియా లేదని విమర్శించారు. పార్టీల పొత్తుల(TDP BJP JSP Alliance)కోసం చంద్రబాబు దిల్లీలో గడపగడపకూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు మాయలో మరో నేషనల్ పార్టీ పడిందన్నారు. జగన్‌ అంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, అందుకే నేరుగా తలపడే దమ్ము లేక దిల్లీ వెళ్లి పొత్తులు పెట్టుకున్నారని సెటైర్లు వేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరుగుతుంటే చంద్రబాబు మాత్రం దిల్లీలో ఇతర పార్టీల గడపలు తిరుగుతున్నారన్నారు.

టీడీపీ కిచిడి మేనిఫెస్టో

చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను తెచ్చుకున్నారని సీఎం జగన్ విమర్శించారు. పవన్ కల్యాణ్ తనకు తక్కువ సీట్లు ఇచ్చినా మాట్లాడడన్నారు. పవన్ చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటాడు, సైకిల్‌ దిగి తొయ్యమంటే తోస్తాడన్నారు. 2014 తరహాలో మళ్లీ చంద్రబాబు మోసపూరితమైన కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చారన్నారు. ఆ కిచిడి మేనిఫెస్టోని వేరే రాష్ట్రాల నుంచి మోసుకొచ్చారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేసిన జగన్‌ను టార్గెట్‌ చేయడమే చంద్రబాబు పని అన్నారు.

త్వరలోనే మేనిఫెస్టో విడుదల

"చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్‌లు, టైర్లు లేవు. సైకిల్ తుప్పు పట్టింది. తుప్పు పట్టిన సైకిల్ తోయడానికి వేరే పార్టీలు కావాలి. చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రజలు మరోసారి ఆలోచించాలి. పేదవాడి భవిష్యత్‌ బాగుపడాలంటే మళ్లీ జగనన్ననే రావాలి. చంద్రబాబు మాయలోడి వలలో పడొద్దని చెప్పండి. మీ అన్న పొత్తులు, ఎత్తులు, జిత్తులను నమ్ముకోడు. చంద్రబాబుకు ఓటు వేయడమంటే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే. ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలి, సైకిల్‌ఇంటి బయటే ఉండాలి. టీ గ్లాస్‌ సింకులోనే ఉండాలి. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో(Ysrcp Manifest) విడుదల చేస్తాం. చంద్రబాబు రంగు రంగుల మేనిఫెస్టో తెచ్చి, తర్వాత చెత్త బుట్టలో పడేస్తుంది. మాట ఇస్తే తగ్గేదే లే అన్నట్లు అమలు చేసే జగన్‌ కావాలా? చంద్రబాబుకు ఓటు వేయడమంటే సంక్షేమ పథకాలు రద్దు చేసినట్లే" - సీఎం జగన్

తదుపరి వ్యాసం