తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Road Accidents : ఏపీలో నెత్తురోడిన రహదారులు, వివిధ ప్రమాదాల్లో 12 మంది మృతి

AP Road Accidents : ఏపీలో నెత్తురోడిన రహదారులు, వివిధ ప్రమాదాల్లో 12 మంది మృతి

26 February 2024, 9:49 IST

google News
    • AP Road Accidents : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ఘటనలో నలుగురు మృతి చెందారు. అన్నమయ్య జిల్లాలో కారు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏపీ రైతులు మృతి చెందారు.
ఏపీలో నెత్తురోడిన రహదారులు
ఏపీలో నెత్తురోడిన రహదారులు

ఏపీలో నెత్తురోడిన రహదారులు

AP Road Accidents : ఆంధ్రప్రదేశ్ లో రహదారులు నెత్తురోడాయి. ఆదివారం అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా... కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ వాసులు ముగ్గురు మృతి చెందారు.

కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం

కాకినాడ(Kakinada) జిల్లా పత్తిపాడు జాతీయ రహదారిపై పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కాకినాడ, చిన్నంపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఏపీఎస్ఆర్టీసీ(APSRTC Bus) బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. లారీకి పంక్చర్ అయిన కారణంగా రోడ్డు పక్కకు ఆపి, నలుగురు వ్యక్తులు టైర్లు మారుస్తున్నారు. ఈ సమయంలో అటుగా వేగంగా వచ్చిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ముగ్గురు లారీ డ్రైవర్లు, ఒకరు క్లీనర్ ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురిది బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెం కాగా, మరొకరిది ప్రత్తిపాడు అని పోలీసులు తెలిపారు. పత్తిపాడు హైవేపై వస్తుండగా లారీ టైర్ పంక్చర్ అయింది. దీంతో టైర్లు మార్చేందుకు హైవే పక్కన లారీని ఆపాడు. టైర్లు మార్చేందుకు పక్క లారీ డ్రైవర్లును పిలిచాడు. వారంతా కలిసి టైర్లు మారుస్తుండగా.. వేగంగా వచ్చిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వారిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగినా ఆర్టీసీ బస్సును ఆపకుండానే డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు వద్ద ఆర్టీసీ బస్సును పట్టుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏపీ వాసులు మృతి

కర్ణాటక (Karnataka)దావణగెరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కర్నూలు (Kurnool)వాసులు మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన మిర్చి రైతులు ప్రయాణిస్తున్న టెంపో వాహనం టైర్‌ పంక్చర్ అయ్యి అదుపుతప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మిర్చి రైతులు మృతి చెందారు. మృతులు పెద్దకడుబూరు మండలం నాగలాపురానికి చెందిన మస్తాన్‌, పెద్దవెంకన్న, మంత్రాలయం మండలం శింగరాజనహల్లికి చెందిన ఈరన్నలుగా పోలీసులు గుర్తించారు. మిర్చి రైతులు లోడ్‌తో మార్కెట్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి

అన్నమయ్య(Annamayya Accident) జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగంగా వచ్చిన స్కార్పియో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ప్రమాదంలో మరణించిన ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మదనపల్లె-బెంగలూరు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్కార్పియో అతి వేగంగా వచ్చి ముందు బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అక్కడి నుంచి పరారయ్యే క్రమంలో స్కార్పియో లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతిచెందారు.

బొలెరో బోల్తా-30 మందికి గాయాలు

అనంతపురం జిర్లా ఉరవకొండలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది కూలీలు గాయపడ్డారు. కూలిపనుల కోసం బొలేరో వాహనంలో 40 మంది వజ్రకరూరు నుంచి పాల్తూరు వెళ్తున్నారు. గుంతకల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో బొలెరో టైర్ పంక్చరై... వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

తదుపరి వ్యాసం