తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apple Fined : ఐఫోన్ తో ఎయిర్ పాడ్స్ ఫ్రీ ప్రకటన- యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా

Apple Fined : ఐఫోన్ తో ఎయిర్ పాడ్స్ ఫ్రీ ప్రకటన- యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా

29 September 2024, 8:51 IST

google News
    • Apple Fined : యాపిల్ సంస్థకు కాకినాడ వినియోగదారుల ఫోరమ్ రూ.1 లక్ష ఫైన్ విధించింది. మోసపూరిత ప్రకటనతో వినియోదారుడిని మానసిక క్షోభకు గురిచేసిందుకు అతడికి రూ.10 వేలు, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఐఫోన్ కొంటే ఎయిర్ పాడ్స్ ఫ్రీ ఆఫర్తో కస్టమర్ ను తప్పుదోవ పట్టించారని అభిప్రాయపడింది.
ఐఫోన్ తో ఇయర్ పాడ్స్ ఫ్రీ ప్రకటన- యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా
ఐఫోన్ తో ఇయర్ పాడ్స్ ఫ్రీ ప్రకటన- యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా

ఐఫోన్ తో ఇయర్ పాడ్స్ ఫ్రీ ప్రకటన- యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా

Apple Fined : ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ సంస్థకు కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది. ఐఫోన్ కొనుగోలుతో ఎయిర్ పాడ్స్ ఫ్రీ ప్రకటన చూసి మోసపోయానని ఓ యువకుడు యాపిల్ పై మూడేళ్ల కింద ఫిర్యాదు చేశాడు. ఫోన్ మాత్రమే పంపి ఎయిర్ పాడ్స్ ఇవ్వలేదని, యాపిల్ సంస్థ తనను మోసం చేసిందని వినియోగదారుల కమిషన్ ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కమిషన్..శనివారం తీర్పు ఇచ్చింది. మోసపూరిత ప్రకటనతో వినియోగదారుడు మానసిక క్షోభకు గురయ్యాడని కమిషన్ అభిప్రాయపడింది. యాపిల్ కు రూ.1 లక్ష ఫైన్ విధించి, ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు జమ చేయాలని ఆదేశించింది.

అసలేం జరిగింది?

మోసపూరిత ప్రకటనతో కస్టమర్ ను తప్పుదోవ పట్టించినందుకు కాకినాడ వినియోగదారుల ఫోరమ్‌ యాపిల్‌ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. కాకినాడ సూర్యరావుపేటకు చెందిన చందలాడ పద్మరాజు 2021 అక్టోబర్ 13న యాపిల్ ఫోన్ ను కొనుగోలు చేశారు. రూ.85,800 పెట్టి యాపిల్‌ ఐ ఫోన్‌ కోనుగోలు చేస్తే రూ.14,900 విలువ చేసే ఛార్జింగ్‌ కేసుతో పాటు ఇయిర్‌ పాడ్స్‌ను ఉచితమని యాపిల్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈ ప్రకటనను చూసిన చందలాడ పద్మరాజు యాపిల్‌ ఫోన్‌ను ఆ సంస్థ వెబ్ సైట్ లో ఆన్‌లైన్‌లో కోనుగోలు చేశారు. అక్టోబర్ 15న ఐఫోన్ ను డెలివరీ చేశారు. అయితే పార్శిల్‌ లో ఐఫోన్ మాత్రమే వచ్చింది. ఎయిర్ పాడ్స్‌ లేవు. దీంతో బాధితుడు యాపిల్‌ సంస్థ ప్రతినిధిని సంప్రదించగా... వారు సరిగా స్పందించలేదు.

ఈ విషయంపై బాధితుడు ఈ-మెయిల్‌ ద్వారా యాపిల్ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. యాపిల్‌ సంస్థ రిప్లై ఇస్తూ...కస్టమర్‌ కేర్‌ ను సంప్రదించాలని సూచించింది. కస్టమర్‌ కేర్‌ను సంప్రదించినా వారు సరిగ్గా స్పందించకపోవడంతో...2022 ఫిబ్రవరి 15న కాకినాడ వినియోగదారుల ఫోరంలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి వాదనలు విన్న కమిషన్‌, పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించింది. యాపిల్ వెబ్‌సైట్‌లో పెట్టిన ప్రకటనను చూసి వినియోగదారుడు మోసపోయాడని కమిషన్ అభిప్రాయపడింది.

సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష జమ చేయండి

రూ.14,900 విలువ చేసి ఎయిర్ పాడ్స్ ఇవ్వని కారణంగా, వినియోగదారుడిని మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10,000, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 యాపిల్ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌...వినియోగదారుడికి చెల్లించాలని కమిషన్‌ ఆదేశించింది. ఇలా మోసపూరిత ఉచిత ఆఫర్ తో కస్టమర్లను ఆకర్షించి, నెరవేర్చకపోవడం తీవ్రంగా భావిస్తూ యాపిల్‌ సంస్థకు రూ.1 లక్ష ఫైన్ విధించింది. ఈ నగదును ఏపీ సీఎం సహాయ నిధికి జమ చేయాలని కాకినాడ వినియోగదారుల ఫోరమ్‌ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్‌, సభ్యులు ఆదేశించారు.

తదుపరి వ్యాసం