Doctor Murder Case: డాక్టర్ హత్య విచారణపై దాగుడుమూతలాట..
14 April 2023, 6:56 IST
- Doctor Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విచారణ కమిటీ సభ్యులను మార్చేయడం వెలుగు చూసింది. ఈ ఘటనపై పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో విషయం వెలుగు చూసింది.
కడపలో వైద్యుడిని హత్య చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
Doctor Murder Case: కడప జిల్లాలో పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ హత్యపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యుడిని మార్చేయడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కమిటీలో పేరు మార్పుపై ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం చేవారు.
కడప పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న మార్చిలో హత్యకు గురయ్యారు. దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర ఆందోళన రావడంతో ఘటనపై విచారణ కోసం కమిటీ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తరపున వేసిన త్రిసభ్య కమిటీలో ఒక పేరు తీసి వేయించి.. మరో పేరును ప్రతిపాదించి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫైల్‌ను పంపించారు.
డాక్టర్ అచ్చన్న హత్య కేసును నీరుగార్చేందుకు త్రిసభ్య కమిటీని గత మార్చి 29న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ ఏర్పాటు చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అచ్చన్న హత్య కేసులో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ పాత్ర కూడా ఉందని ఉద్యోగులు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అచ్చన్న హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు తనకు అనుకూలంగా ఉన్న వాళ్లను కమిటీలో నియమించి విచారణ చేపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కమిటీలో విశాఖపట్నంలోని పశు సంవర్దక శాఖ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సింహాచలం, విజయవాడ డైరెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రజిని కుమారి , రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ గా పని చేస్తున్న వెంకట్రావుల నియమించారు. కమిటీలో రజినికుమారి ఉంటే తనకు ఇబ్బందికరంగా నివేదిక ఉంటుంది భావించి ఆమెపై ఒత్తిడి చేసి.. ఆరోగ్యం బాగోలేదని లెటర్ రాయించుకొని.. ఆమె స్థానంలో రత్నకుమారిని కమిటీలో నియమించారని ఆరోపిస్తున్నారు.
అడిషనల్ డైరెక్టర్ రజిని కుమారి స్థానంలో రాష్ట్ర పశు సంవర్దక శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రత్నకుమారిని నియమించే క్రమంలో ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యుల్ని ఎందుకు మార్చాలని నిలదీయడంతో అధికారులు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. కొత్త కమిటీ నియామక ఫైల్ అమోదించకుండా నిలిపివేయడంతో విషయంలో బయటకు పొక్కింది. ఈ కేసులో ఇప్పటికే వివిధ సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళన జరుగుతుండటంతో తనకు చుట్టుకుంటుందనే ప్రిన్సిపల్ సెక్రటరీ జాగ్రత్త పడినట్లు తెలుస్తోదంి.
పశు సంవర్థక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ చంద్రబోస్ కు పీజీ అర్హత లేకున్నా వెటర్నరీ పాలి క్లినిక్ లో నాలుగు నెలల క్రితం పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ అనర్హుడికి పోస్టింగ్ ఇచ్చారని డాక్టర్ అచ్చన్న అభ్యంతరం తెలిపారు. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ సుబాష్ చంద్రబోస్‌పై విచారణకు ఆదేశించారు. దీంతో నిందితుడు కక్ష పెంచుకున్నాడు.
పశు వైద్యలో పీజీ లేకుండా ప్రభుత్వ జీవో ప్రకారం పాలీ క్లినిక్ లో నియమించడాన్ని డాక్టర్ అచ్చన్న వ్యతిరేకించారు. లోకాయుక్తకు డాక్టర్ అచ్చన్న ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన సుభాష్ చంద్రబోస్ చివరికి డాక్టర్ అచ్చన్నను హత్య చేశాడు. హత్య వ్యవహారంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ పాత్రపై విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సభ్యులను మార్చడానికి డైరెక్టర్ ప్రయత్నించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.