తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kadapa Doctor Murder: సిఎం ఇలాకాలో దళిత అధికారి దారుణ హత్య

Kadapa Doctor Murder: సిఎం ఇలాకాలో దళిత అధికారి దారుణ హత్య

HT Telugu Desk HT Telugu

27 March 2023, 9:11 IST

google News
  • Kadapa Doctor Murder: కడపలో  కిడ్నాప్‌‌కు గురైన జిల్లా పశుసంవర్థక శాఖ డీడీ దారుణ హత్యకు గురయ్యారు. ఆఫీసు గొడవల నేపథ్యంలో ఆయన కింద పని చేసే సిబ్బంది ప్రమేయంతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  కులం కారణంగానే  దళిత అధికారిని హత్య చేశారని మందకృష్ణ ఆరోపించారు. 

హత్యకు గురైన డాక్టర్ అచ్చెన్న
హత్యకు గురైన డాక్టర్ అచ్చెన్న

హత్యకు గురైన డాక్టర్ అచ్చెన్న

Kadapa Doctor Murder: కడపలో అదృశ్యమైన పశుసంవర్థక శాఖ డీడీ డాక్టర్ అచ్చన్న దారుణహత్యకు గురయ్యారు. కిడ్నాప్‌కు గురైన వైద్యుడు శవమై కనిపించాడు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 14న డాక్టర్ అచ్చన్న అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం చేసిన పోలీసులు 24న అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబానికి సమాచారం ఇవ్వకుండానే శవపరీక్ష చేయడం, తన తండ్రిని కులం పేరుతో దూషించి వేధించారని అచ్చెన్న తనయుడు ఆరోపించారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కిడ్నాప్‌కు గురైన దళిత ఉద్యోగి, పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్‌ చిన్న అచ్చెన్న హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అచ్చన్నను కిడ్నాప్‌ చేసి అంతమొందించారు. అచ్చన్న హత్యలో సహోద్యోగులుతో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయమూ వెలుగుచూసింది. అపహరించిన రోజే అచ్చెన్నను నిందితులు చంపేశారు.

ఏపీ సిఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి సొంత జిల్లాలో దళిత అధికారి ఇలా దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. అచ్చెన్న కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా, ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు శ్రద్ద చూపలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బాధితుల ఫిర్యాదు చేసిన వారిని కనీసం విచారించలేదు.

కిడ్నాప్‌ జరిగిన 12 రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతదేహం బయటపడితే తప్ప పోలీసులు కదల్లేదు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి, అదృశ్యమైనా పోలీసులు కనీసం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దళిత వర్గానికి చెందిన ఉన్నతాధికారి కనిపించట్లేదని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అచ్చెన్న మృతదేహం లభించిన తరవాత.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే శవపరీక్ష నిర్వహించి హడావుడిగా వారికి మృతదేహాన్ని అప్పగించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

విధుల్లో చేర్చుకునేందుకు నిరాకరించడమే చేసిన పాపం…

కడప మల్టీ స్పెషాలిటీ పశువైద్యశాలలో డీడీగా పనిచేస్తున్న అచ్చెన్నకు అదే వైద్యశాలలో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేసే శ్రీధర్‌ లింగారెడ్డి, సురేంద్రనాథ్‌ బెనర్జీ, సుభాష్‌ చంద్రబోస్‌కు మధ్య విధులకు సంబంధించి ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది.

శ్రీధర్‌ లింగారెడ్డి, సురేంద్రనాథ్‌ బెనర్జీ, సుభాష్‌ చంద్రబోస్‌లు విధి నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించట్లేదని, తనకు సహకరించట్లేదంటూ అచ్చెన్న వారిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. అచ్చెన్నే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆ ముగ్గురూ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. సరెండర్‌ చేసిన ఆ ముగ్గురినీ విధుల్లో చేర్చుకోవాలంటూ అచ్చెన్నను ఉన్నతాధికారులు ఆదేశించారు. అందుకు నిరాకరించారు. ఈ ఘటన జరిగిన తర్వాత కొద్ది రోజులకే నెల 12న అచ్చెన్న అదృశ్యమయ్యారు.

అచ్చన్న అదృశ్యంపై కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 14న కేసు నమోదు చేసినా, 24వ తేదీ వరకూ దర్యాప్తులో పోలీసులు ఎలాంటి పురోగతీ సాధించలేదు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్లో రహదారి గోడ కింద ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ మృతదేహం అచ్చెన్నదిగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు తేల్చారు.

కిడ్నాప్‌ చేసిన వెంటనే హత్య….

కడపలోని కోటిరెడ్డి సర్కిల్‌ సమీపంలోని చర్చికి వెళ్లిన అచ్చెన్నను నిందితులు కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందిస్తే వెంటనే చిక్కుముడి వీడేది. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినా బాధ్యులెవరో గుర్తించేందుకు వీలుండేది. పోలీసులు ఈ అదృశ్యం ఘటనలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. అచ్చెన్న మృతికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించినట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. అచ్చెన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

కిడ్నాప్‌కు గురైతే సస్పెన్షన్ ఉత్తర్వులు….

హతుడు డాక్టర్ అచ్చెన్న కుటుంబం కర్నూలులో నివసిస్తోంది. ఆయన ఉద్యోగరీత్యా కడపలో ఒంటరిగా ఉంటున్నారు. ఈ నెల 12న ఉదయం 11.30 గంటల నుంచి అచ్చెన్న ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉండటం, 14వ తేదీ వరకూ ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన కుమారుడు క్లింటన్‌ చక్రవర్తి, అచ్చెన్న సహోద్యోగి ఒకర్ని సంప్రదించారు. ఈ నెల 12న చర్చికి వెళ్తానంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఆయన సమాధానమిచ్చారు.

దీంతో క్లింటన్‌ చక్రవర్తి వెంటనే కడప చేరుకుని తన తండ్రి కనిపించట్లేదంటూ మార్చి 14న వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీధర్‌ లింగారెడ్డి, సుభాష్‌ చంద్రబోస్‌, సురేంద్రనాథ్‌ బెనర్జీలపై తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేదు. అచ్చెన్న అదృశ్యంపై స్పందించని ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఆదేశాలు పాటించనందుకు ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు పంపించింది.

కులం పేరుతో వేధించి చంపేశారన్న అచ్చెన్న కుమారుడు

తన తండ్రిని తీవ్ర వేధింపులకు గురిచేసి చంపేశారని మృతుని కుమారుడు కళ్యాణ చక్రవర్తి ఆరోపించారు. ఆయన కింద పనిచేసే సహాయ సంచాలకులు కులం పేరుతో దూషించేవారని ఆరోపించాడు. విధులు నిర్వహించకుండా అడ్డుకునేవారని, తన తండ్రి కనిపించట్లేదంటూ ఈ నెల 14న ఫిర్యాదు చేశామని, కేసు ఏమైందో తెలుసుకోడానికి నాలుగైదు సార్లు పోలీసుస్టేషన్‌కు వెళ్లి కలిశామని తెలిపారు.

సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామంటూ దాటవేశారని, దర్యాప్తులో సరిగ్గా స్పందించ లేదన్నారు అనుమానితుల పేర్లు మేము ఫిర్యాదులోనే పేర్కొన్నా వారినీ విచారించలేదు. చివరికి ఈ నెల 21న మా కుటుంబ సభ్యుల్నే గంటపాటు విచారించారని, మేము ఫిర్యాదు చేసిన మరుసటి రోజే మా నాన్నను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులివ్వడం ఆశ్చర్యం కలిగిందన్నారు. సహాయ సంచాలకుల పనితీరుపై లోకాయుక్తకు అచ్చెన్న ఫిర్యాదు చేశారని, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌, వైయస్‌ఆర్‌ జిల్లా జేడీ కూడా తమ తండ్రిని వేధించారని తెలిపారు.

అచ్చెన్న హత్యపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అచ్చెన్న హత్యపై మగ్ర విచారణ జరిపి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. జిల్లా ఎస్పీని కలిసి కేసుపై మాట్లాడారు.

తదుపరి వ్యాసం