తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Degree Admissions: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరండి, ఉన్నత విద్యాశాఖ పిలుపు, నేటి నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు

AP Degree Admissions: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరండి, ఉన్నత విద్యాశాఖ పిలుపు, నేటి నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు

Sarath chandra.B HT Telugu

26 July 2024, 8:04 IST

google News
    • AP Degree Admissions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పడిపోతున్న అడ్మిషన్లు ఉన్నత  విద్యా మండలిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నేటి నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లలో వెబ్‌ ఆప్షన్లు నమోదు ప్రారంభం కానుంది. 
నేటి నుంచి డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్స్
నేటి నుంచి డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్స్

నేటి నుంచి డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్స్

AP Degree Admissions: రండిబాబు రండి డిగ్రీ కోర్సుల్లో చేరండి అంటూ ఏపీ ఉన్నత విద్యామండలి విద్యార్ధుల్ని వేడుకుంటోంది. గత కొన్నేళ్లుగా ఏపీలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పడిపోతున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. ఆన్‌లైన్‌ అడ్మిషన్ ప్రక్రియలో కీలకమైన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.

రిజిస్ట్రేషన్లు ప్రారంభం…

ఏపీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్య మండలి ఆన్‌లైన్‌ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల పరిధిలో రెజిస్ట్రేషన్లను ప్రారంభించింది. జూలై 2 నుంచి 25వరకు విద్యార్ధులకు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించారు. విద్యార్ధుల ధృవ పత్రాల వెరిఫికేషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్లలో జూలై 5 నుంచి నిర్వహిస్తున్నారు.

జూలై 26 నుంచి 29వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం అవుతుంది. 30వ తేదీన వెబ్‌ ఆప్షన్లలో మార్పు చేసుకోవచ్చు. ఆగస్టు 3న సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 5 నుంచి 8వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 5 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 1214 ప్రభుత్వ యూనివర్శిటీ అనుబంధ కాలేజీలతో పాటు ప్రైవేట్ యూనివర‌్శిటీల్లోని డిగ్రీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ యూనివర్శిటీల్లో కూడా ఇదే నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వ కోటా అడ్మిషన్లను కల్పిస్తారు.

ఆరు జోన్లలో అడ్మిషన్లు…

ఏపీలో మొత్తం ఆరు యూనివర్శిటీ ఏరియాల వారీగా అడ్మిషన్లను చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఓ యూనిట్‌గా, విశాఖపట్నం అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు మరో యూనిట్‌గా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఒక యూనిట్‌లో, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు మరో యూనిట్‌లో అడ్మిషన్లు చేపట్టారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాకు ఒక యూనిట్‌, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అనంతపరం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు మరో యూనిట్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు మరో విభాగంలో అడ్మిషన్లను చేపట్టారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరండి…

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉన్న కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తోంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన డిగ్రీ విద్యనందించే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవాలని ఏపీ ఉన్నత విద్యా మండలి సూచిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యాశాఖ నిర్వహణలో మొత్తం 169 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 24 కళాశాలలు స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉన్నాయి. విద్యార్థినుల కోసం ప్రత్యకంగా 23 మహిళా డిగ్రీ కళాశాలలు, వసతి గృహ సదుపాయంతో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 106 కళాశాలలు న్యాక్ అక్రెడిటేషన్ ఉన్నాయి.

నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF), యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC), డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (DBT), రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్ (RUSA) వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటుగా రాష్ట్రప్రభుత్వం అందించే ప్రత్యేక నిధుల సహకారంతో డిజిటల్ – వర్చువల్ తరగతి గదులు, అధునాతన ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్ లు, విశాలమైన క్రీడా మైదానాలు, బొటానికల్ గార్డెన్స్, మెడిసినల్ గార్డెన్స్, అత్యాధునిక జిమ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అత్యుత్తమ బోధనా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

సింగల్ మేజర్ విధానం…

2020 నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో సింగిల్ మేజర్ విధానం ద్వారా సంప్రదాయ కోర్సులైన చరిత్ర, రాజనీతి, అర్థశాస్త్రం, తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, వాణిజ్య - భౌతిక-రసాయన- గణిత – జంతు – వృక్ష శాస్త్రాలతో పాటుగా, స్కిల్ సెక్టార్ కౌన్సిల్స్ వంటి జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని టూరిజం హాస్పిటాలిటీ - పెట్రో కెమికల్స్ - డేటా సైన్స్ – ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – బిబిఎ హెల్త్ మేనేజ్ మెంట్ – డిజిటల్ మార్కెటింగ్ – ఫినాన్షియల్ మేనేజ్మెంట్ – రిటైల్ ఆపరేషన్స్ – లాజిస్టిక్ మేనేజ్మెంట్ – ఈవెంట్ మేనేజ్మెంట్ – బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ & ఇన్సూరెన్స్ - న్యూట్రిషన్ డెయిటిక్స్ – ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి అత్యాధునిక, ఉపాధి, శిక్షణా నిబిడీకృత కోర్సులను సైతం తక్కువ ఫీజులతో అందుబాటులో ఉన్నాయని కళాశాల విద్యాశాఖ చెబుతోంది.

2024-25 విద్యా సంవత్సరంలో ఆర్ట్స్ విభాగంలో 25 కోర్సులు, కామర్స్ విభాగంలో 20, సైన్స్‌లో 35, వొకేషనల్ విభాగంలో 4 కోర్సులు అందిస్తున్నారు. భవిష్యత్తుపై భరోసా కల్పించే దిశగా చదువుతో పాటు సమాంతరంగా ఉపాధి శిక్షణ, ఉపాధి కల్పన కోసం స్కిల్ సెక్టార్ కౌన్సిల్స్‌తో ఒప్పందాలు అమలు చేస్తున్నారు.

స్టార్ట్‌‌ అప్‌లను ప్రోత్సహించేందుకు గా “earn while learn” వంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ఆర్థిక నిర్వహణలో మెళకువలు బోధిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు పి. జి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిస్తున్నారు. 2024 పి. జి. ప్రవేశ పరీక్ష నందు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 1673 మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ప్రకటించారు.

గత ఏడాది దారుణంగా పడిపోయిన దరఖాస్తులు…

గత ఏడాది కూడా డిగ్రీ కాలేజీ అడ్మిషన్ల గణనీయంగా తగ్గిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే అడ్మిషన్లు పూర్తయ్యేసరికి అందులో సగం కూడా నిండలేదు. డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో కౌన్సెలింగ్ గడువును ఉన్నత విద్యామండలి పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

నేటి నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు…

ఏపీ డిగ్రీ కాలేజీ అడ్మిషన్ల ప్రవేశాల్లో భాగంగా జూలై 26 నుంచి 29వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం అవుతుంది. 30వ తేదీన వెబ్‌ ఆప్షన్లలో మార్పు చేసుకోవచ్చు. ఆగస్టు 3న సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 5 నుంచి 8వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 5 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.రాష్ట్ర వ్యాప్తంగా 1214 ప్రభుత్వ యూనివర్శిటీ అనుబంధ కాలేజీలతో పాటు ప్రైవేట్ యూనివర‌్శిటీల్లోని డిగ్రీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ యూనివర్శిటీల్లో కూడా ఇదే నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వ కోటా అడ్మిషన్లను కల్పిస్తారు.

తదుపరి వ్యాసం