నామమాత్రపు లీజుతో 26 వైసీపీ కార్యాలయాలకు స్థలాలు: లోకేశ్ ఆరోపణ
24 June 2024, 8:19 IST
జగన్ ప్రభుత్వం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల కోసం 42 ఎకరాల భూమిని రూ.1,000 లీజుకు కేటాయించిందని నారా లోకేశ్ ఆరోపించారు.
వైసీపీ కార్యాలయాలకు నామమాత్రపు లీజు రుసుంతో విలువైన భూములు కట్టబెట్టారని ఆరోపణలు చేసిన మంత్రి నారా లోకేష్
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం పార్టీ కార్యాలయాల నిర్మాణానికి 26 జిల్లాల్లో 42 ఎకరాల భూమిని రూ.1,000 నామమాత్రపు లీజుతో 33 ఏళ్ల పాటు కేటాయించిందని ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.
నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాలకు సంబంధించిన పలు చిత్రాలతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో మంత్రి ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
'మీరు (జగన్) 26 జిల్లాల్లో 42 ఎకరాల భూమిని 33 ఏళ్లకు రూ.1,000 లీజుకు కేటాయించారు' అని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాల డజనుకు పైగా చిత్రాలను జత చేస్తూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని ఇటీవల కూల్చివేసిన నేపథ్యంలో ఆయా కార్యాలయాలకు లీజులపై లోకేష్ ఆరోపణలు చేశారు. ఇక వై.ఎస్.జగన్ రుషికొండలో నిర్మించిన భవనాలు ఇటాలియన్ పాలరాతి, 200 షాండ్లియర్లు, 12 పడక గదులు, బహుళ రంగుల వెలుగులు, ఇతర విలాసాలతో నిర్మించిన సీ వ్యూ భవనం చర్చనీయాంశమైంది.
సుమారు రూ. 600 కోట్ల విలువ చేసే ఈ 42 ఎకరాల భూమిని 4,200 మంది పేదలకు ఒక సెంటు చొప్పున సులభంగా సమకూర్చవచ్చని లోకేశ్ పేర్కొన్నారు. రుషికొండ భవనానికి వెచ్చించిన డబ్బుతో 25 వేల మందికి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న భవనాలకు సంబంధించిన 19 చిత్రాలను టీడీపీ ఆదివారం వెలుగులోకి తెచ్చింది. తాడేపల్లిలో వైసీపీ నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘పార్టీ కార్యాలయాల నిర్మాణం పేరుతో మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో వందల కోట్ల విలువైన భూములను వైసీపీ ఎలా కబ్జా చేసిందనే వివరాలను ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు' అని టీడీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ, భవనాల అంచనా వ్యయం రూ. 2 వేల కోట్ల వరకు ఉండొచ్చని అధికార పార్టీ అంచనా వేస్తోంది. 2014 నుంచి 2019 వరకు గత టీడీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకు అధికార టీడీపీకి కేటాయించిందని వైసీపీ ఆరోపించింది.