తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Kidney Racket: ఏపీలో కొత్త దందా.. పేదలకు డబ్బు ఎర..కిడ్నీలు కాజేస్తున్న ముఠాలు

Visakha Kidney Racket: ఏపీలో కొత్త దందా.. పేదలకు డబ్బు ఎర..కిడ్నీలు కాజేస్తున్న ముఠాలు

HT Telugu Desk HT Telugu

27 April 2023, 11:43 IST

google News
    • Visak Kidney Racket: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అవయవ మార్పిడి యథేచ్ఛగా సాగుతోంది.  విజయవాడలో ఘటన మరువక ముందే విశాఖలోని తిరుమల ఆస్పత్రిలో అక్రమంగా అవయవ మార్పిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. 
విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠా కలకలం
విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠా కలకలం

విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠా కలకలం

Kidney Racket: ఆర్డీవో విచారణ, జీవన్ దాన్‌ అనుమతులు అక్కర్లేకుండానే ఏపీలో యథేచ్ఛగా అక్రమ అవయవ మార్పిడి సర్జరీలు జరిగిపోతున్నాయి. విజయవాడలో ఇటీవల వెలుగు చూసిన అవయవ మార్పిడి ఉదంతాన్ని మరచిపోక ముందే విశాఖలో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది.

అవయవ దానం చేస్తే ఎనిమిదిన్నర లక్షల రుపాయలు ముట్టచెబుతామని హామీ ఇచ్చి సర్జరీ తర్వాత రెండున్నర లక్షలు చేతిలో పెట్టారని బాధితుడు ఆరోపిండం కలకలం రేపింది. విశాఖలోని తిరుమల ఆస్పత్రిలో సర్జరీ జరిగినట్లు బాధితుడు ఆరోపించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

పేదలకు డబ్బు ఆశచూపి కిడ్నీలు కాజేసే ముఠాలు ఏపీ అంతట చెలరేగి పోతున్నాయి. రాజకీయ పలుకుబడితో విజయవాడలో గత నెలలో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి వ్యవహారాన్ని మరుగున పడేశారు. తాజాగా విశాఖపట్నంలో కూడా ఇలాంటి వ్యవహారం వెలుగు చూసింది. అక్రమ అవయవ మార్పిడితో ప్రాణాలు తీస్తోన్న రాకెట్‌ ముఠా గుట్టు బయటపడింది.

పెందుర్తిలో ఓ ప్రైవేటు ఆసుత్రి కేంద్రంగా సాగుతున్న అక్రమ కిడ్నీమార్పిడి రాకెట్‌ దందా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అమాయకులకు ఎరవేసి, పేదల అవయవాలను కాజేస్తోన్న ఓ ముఠా వినయ్‌ అనే యువకుడి కిడ్నీ కాజేసింది. నాలుగు నెలల క్రితం సర్జరీ జరగగా ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో మంచానికి పరిమితం అయ్యాడు. ఏకంగా ఏడుగురు బాధితుల నుంచి బ్రోకర్లు కిడ్నీలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

విశాఖలోని మధుర వాడ వాంబేకాలనీలో కిడ్నీరాకెట్‌ దందా వెలుగు చూసింది. పెందుర్తిలోని తిరుమల ఆస్పత్రి కేంద్రంగా సర్జరీలు జరిగినట్లు పొక్కడంతో కలకలం రేగింది. వాంబేకాలనీకి చెందిన వినయ్‌కుమార్‌కి డబ్బు ఆశచూపి కామరాజు, శ్రీను అనే దళారులు కిడ్నీ కొట్టేశారు. ఒక కిడ్నీ అమ్మితే రూ.8.50లక్షల రుపాయలు ఇస్తామని నమ్మబలికారు. ఆపరేషన్‌ అయ్యాక రెండు లక్షలు చేతిలో పెట్టి ఉడాయించారు. కిడ్నీ పోగొట్టుకొని ప్రాణాపాయ స్థితికి చేరాడు.

మరోవైపు అక్రమంగా కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసిన తిరుమల ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పరమేశ్వర్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో విచారణ ప్రారంభించారు. కిడ్నీ సర్జరీలతో అనారోగ్యం పాలైన వారిని గుర్తించేందుకు డిఎమ్‌హెచ్‌ఓ నేతృత్వంలో ఓ వైద్య బృందాన్ని నియమించారు.

తదుపరి వ్యాసం