Kidney Racket: కిడ్నీ రాకెట్‌తో కుమ్మక్కయ్యారా.. అసలు దొంగలు ఎవరు..?
Kidney Racket:విజయవాడ అక్రమ అవయవ మార్పిడి అసలు దొంగలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. చాపకింద నీరులా సాగుతున్న ఈ వ్యవహారంలో పోలీసుల వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఘటన వెలుగు చూసిన వెంటనే దర్యాప్తు చేయాల్సిన వారు, సంఘటనను తొక్కి పెట్టడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Kidney Racket: విజయవాడ అక్రమ అవయవ మార్పిడి వ్యవహారం కొన్నాళ్లుగా చాపకింద నీరులా సాగుతున్నట్లు కనిపిస్తోంది. అవయవ మార్పిడి ఉదంతంపై ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టాల్సిన పోలీసులు రాజీ చేసుకోడానికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. Bezawada Kidney case అక్రమ అవయమ మార్పిడి చట్ట విరుద్ధమని తెలిసినా ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు స్వయంగా ఈ వ్యవహారంలో పాల్గొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమిషనరేట్‌కు చెందిన అధికారి ఒకరు ఈ వ్యవహారంలో పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి నెలాఖర్లో ఆన్‌లైన్‌లో బాధితుడు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సమాచారం వెంటనే ఆస్పత్రి వర్గాలకు చేరిపోయింది. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడానికి ముందే కిడ్నీ మార్పిడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన దళారులు, వైద్యులకు చేరడంతో బాధితుడిని బుజ్జగించి, బెదిరించి లొంగదీసుకోడానికి సహాయ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
కిడ్నీ మార్పిడి వ్యవహారంలో నగరంలోని ఆస్పత్రలు అనధికారిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జీవన్ దాన్ ట్రస్టు ద్వారా అవయవ మార్పిడి జరగాలంటే బాధితుడికి రక్త సంబంధీకులై ఉండాలి. లేదంటే బ్రెయిన్ డెడ్ కేసుల్లో సరిపోయే అవయవం లభించాలి. ఇలా కాకుండా సంతలో సరుకుల్లా అవయవాలను డబ్బుకు అమ్ముకునే దందాకు విజయవాడ కేరాఫ్ అడ్రస్‌గా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చేతిలో డబ్బుంటే అవయవాలను మార్చుకోవడం పెద్ద కష్టం కాదని కొన్ని ఆస్పత్రులు భరోసా కల్పిస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో పనిచేసే టెక్నిషియన్లు, దళారులు ఆర్థిక అవసరాల్లో ఉండే వారిని గుర్తించి ఎర వేస్తున్నారు. గత ఏడాది జరిగిన కిడ్నీ మార్పిడి వ్యవహారంలో బాధితుడికి ఇస్తామన్న డబ్బు అందక పోవడంతో వారిపై ఒత్తిడి పెంచేందుకు గత వారం మీడియా ముందుకు వచ్చాడు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం బాధితుడితో స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకోవడంతో పాటు వార్తను వెలుగు చూడకుండా మేనేజ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో కిడ్నీ మార్పిడి వ్యవహారాన్ని తొక్కి పెడుతున్నారని, లక్షల రుపాయల లావాదేవీలు జరిగాయని హైదరాబాద్‌లో మీడియా సంస్థల కార్యాలయాలకు ఫిర్యాదులు అందడంతో వ్యవహారంలో కదలిక వచ్చింది. దీంతో వరుస కథనాలు వెలువడ్డాయి. అప్పటి వరకు వ్యవహారాన్ని బయటకు రానీయకుండా చేసే ప్రయత్నాలు విఫలం కావడంతో పోలీసులు ఖంగుతిన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విచారణ ప్రారంభించారు. ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ప్రచారం జరగడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని వైద్య శాఖను ఆదేశించింది.
మరోవైపు కిడ్నీ మార్పిడి వ్యవహారంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కూడా స్పందించింది. కిడ్నీ మార్పిడి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నత అధికారులు, ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ సౌభాగ్య లక్ష్మి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. కిడ్నీ మార్పిడి చేయాలంటే చట్టపరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు అక్రమ అవయవ మార్పిడి జరిగినట్లు స్పష్టమైనా ఈ వ్యవహారంలో పాత్ర పోషించిన పాత్రధారులు, దళారులు, మధ్యవర్తుల్ని కాపాడేందుకు బెజవాడ పోలీసులు నానా తంటాలు పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
సంబంధిత కథనం