Bezawada Kidney Case: కేసులొద్దు, రాజీ ముద్దు..బెజవాడ పోలీసుల వింత వైఖరి
Bezawada Police: విజయవాడలో వెలుగు చూసిన ఓ వ్యవహారంలో పోలీసుల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. నగరంలోని ఓ ఆస్పత్రిలో కొండపల్లికి చెందిన యువకుడి నుంచి అనధికారికంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మీడియాను బెదిరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Bezawada Police: సంతలో సరుకుల్లా మానవ అవయవాల్ని యధేచ్ఛగా విక్రయిస్తున్న వ్యవహారం విజయవాడలో వెలుగు చూసింది. ఆర్ధిక అవసరాలతో ఏడాది క్రితం కొండపల్లికి చెందిన ఓ వ్యక్తి నగరంలోని ఓ ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ విక్రయించి అప్పులు తీర్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అప్పులిచ్చిన వారే స్వయంగా కిడ్నీ కొనుగోలు చేసే వారిని వెదికి, బాధితుడితో అవయవదానానికి ఒప్పించారు.ఈ వ్యవహారంలో ఆస్పత్రిలో డయాలిసిస్ టెక్నిషియన్‌గా పనిచేసే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్లు బాధితుడు చెబుతున్నాడు.
ఈ క్రమంలో నగరంలోని ఓ ఆస్పత్రిలో గత ఏడాది మార్చి- జూన్ మధ్య కాలంలో పలు దఫాలుగా పరీక్షలు నిర్వహించి అవయవదానానికి ఏర్పాట్లు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, అవయవదాతకు, స్వీకర్తకు మధ్య బాండ్ పేపర్ మీద ఒప్పందం చేసి సర్జరీ చేసేశారు. సర్జరీ పూర్తైన తర్వాత నకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని ఆరోపిస్తూ అవయవదానం చేసిన వ్యక్తి ఆందోళనకు దిగాడు.
ఈ క్రమంలో గత వారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. దాదాపు వారం రోజులుగా రక రకాల మలుపులు తిరిగింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, జీవన్ దాన్ ట్రస్ట్ అనుమతులు లేకుండానే కిడ్నీ సర్జరీ ఎలా జరిగిందనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. విజయవాడలో ని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో ఇలాంటి తతంగాలు నిత్యకృత్యంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. అవయవ దానం జరిగే సమయంలో దానం చేస్తున్నఇంటి పేరు, వివరాలను మార్చి, రోగి సోదరుడిగా చూపించి పత్రాలు రూపొందించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆర్ధిక అవసరాలతోనే తాను నిందితులకు సహకరించానని, సర్జరీ తర్వాత ఇస్తామన్న డబ్బు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు. డబ్బులు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని వీడియోలు రిలీజ్ చేశాడు.
ఈ వ్యవహారంపై మార్చి 31వ తేదీన విజయవాడ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన సత్యనారాయణ పురం పోలీసులు బాధితుడు, ఆస్పత్రి వర్గాలను పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత బాధితుడు రాతపూర్వక ఫిర్యాదు చేయలేదనే కారణంతో కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత బాధితుడు తన సమస్య పరిష్కారం అయిపోయిందని మరో వీడియో రిలీజ్ చేశాడు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యానికి అనుకూలంగా ఓ ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. బాధితుడికి, ఆస్పత్రి నిర్వాహకులతో రాజీ కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించినట్లు చెబుతున్నారు. పెద్ద ఎత్తున నగదు చేతులు మారడంతో వ్యవహారాన్ని తొక్కి పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ఫిర్యాదు లేకుండా కేసెలా….?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యవహారంలో విజయవాడ పోలీస్ ఉన్నతాధికారి వైఖరి వివాదాస్పదంగా మారింది. అక్రమాలు జరిగితే కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిన బాధ్యతలో ఉన్న వారు కేసును నీరుగార్చేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. గత వారం ఈ కేసు వెలుగు చూసిన తర్వాత వ్యవహారం బయటకు పొక్కనీయకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందనే ఆరోపణలు వెలుగు చూశాయి. ఫిర్యాదు అందిన విచారణ జరిపామని, ఈ వ్యవహారంలో కేసు అవసరం లేదని బాధితుడు చెప్పడంతోనే కేసు నమోదు చేయలేదని సత్యనారాయణపురం పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
ఈ క్రమంలో ఘటన గురించి బెజవాడ పోలీస్ శాఖ బాధ్యుడిని, అక్రమ అవయవ మార్పిడి వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే రచ్చ చేస్తే ఈ వ్యవహారంలో మీడియా పాత్ర కూడా బయటకు వస్తుందని పరోక్షంగా హెచ్చరించే ప్రయత్నం చేశారు. తమ వద్ద సీసీటీవీ ఫుటేజీలు, ఆడియో క్లిప్పులు ఉన్నాయని వాటిని కూడా బయట పెట్టాల్సి వస్తుందని, తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధం కావాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
జీవన్ దాన్ నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా, దర్యాప్తుకు మాత్రం వెనకాడుతున్నట్లు స్పష్టమైంది. వ్యవహారం వెలుగు చూసిన వెంటనే ఆస్పత్రిపై వైద్య, ఆరోగ్య శాఖ, రెవిన్యూ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నా పోలీస్ ఉన్నతాధికారి ఆ ధైర్యం చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. .
అక్రమ అవయవ మార్పిడి తీవ్రమైన వ్యవహారం అయినా ఫిర్యాదు చేసే వారు లేరనే సాకుతో కేసును నీరు గార్చేందుకు బెజవాడ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిర్యాదు దారుడు లేకపోయినా వైద్య ఆరోగ్య శాఖ, డిఎంహెచ్‌ఓల సహకారంతో కేసులు నమోదు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
నార్కోటిక్స్, గంజాయి, ఆయుధాల కేసుల్ని నమోదు చేసినట్లే అక్రమ అవయవ మార్పిడి కేసుల్లో కూడా పోలీసులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది జయప్రకాష్ చెప్పారు. ఫిర్యాదుదారుడు లేనందున తప్పులు, అక్రమాలను ఊపేక్షిస్తామనే పోలీసుల వైఖరి సరికాదన్నారు. విజయవాడలో చాపకింద నీరులా సాగుతున్న ఈ తరహా వ్యవహారాలకు ప్రభుత్వ విభాగాల సహకారం లేకుండా సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. .