Cyclone Mandous Updates: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు!
08 December 2022, 7:39 IST
- Heavy rainfall alert for Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తుపానుగా మారనుంది. ఫలితంగా తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఏపీకి భారీ వర్ష సూచన
Weather Updates of Andhrapradesh: ఆగ్నేయ బంగాళాఖాతం(Bay Of Bengal)లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. గురువారం ఉదయం తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరించింది. తుపాను కారణంగా తమిళనాడు(Tamil Nadu), దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
గురవారం ఉదయం నాటికి నైరుతి బంగాళాఖాతంలో సమీపంలోని ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు తుపాను చేరనుందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ కారణంగా గురువారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు(Nellore), తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీవ్ర వాయుగుండం.. తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తీరాలను డిసెంబర్ 8 ఉదయం వరకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు వానలు పడనున్నాయి.
ఈ తుపానుకు మాండూస్ అని పేరు పెట్టారు వాతావరణశాఖ అదికారులు. 9వ తేదీన పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 65–75 కి.మీలు, గరిష్టంగా 85 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇది అంచనాకి మించి నష్టం కలిగించే ప్రమాదం ఉందని లెక్కలు వేస్తున్నారు.
మరోవైపు తుపాన్ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలకోసం 5-ఎన్డీఆర్ఎఫ్, 4-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
టాపిక్