విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని ముగ్గరు మృతి
04 September 2024, 9:27 IST
- విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన మంగళవారం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-పెందుర్తి రోడ్డులో ఆనందపురం బ్రిడ్జిపై జరిగింది.
విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-పెందుర్తి రోడ్డులో ఆనందపురం బ్రిడ్జిపై ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)
మంగళవారం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-పెందుర్తి (16వ నెంబర్ జాతీయ రహదారి) రోడ్డులో ఆనందపురం బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి ఒరిస్సాలోని భువనేశ్వర్‌కు చేపల లోడుతో వెళ్తున్న లారీ, ఆనందపురం బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ దాటుకొని అవతలి వైపు నుంచి ఎదురుగా రాయగడ నుంచి ఖమ్మం వెళ్తున్న అట్టల లోడు లారీని బలంగా ఢీకొంది.
దీంతో రెండు లారీల్లోని డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఢీకొట్టిన లారీలోని క్లీనర్ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో లారీ క్లీనర్‌కు స్వల్పంగా గాయాలు అయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, లారీలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. మృతులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు.
చేపల లోడు లారీ డ్రైవర్ ఒరిస్సాలోని ఖుర్ధా జిల్లా, బాణాపూర్ తాలుకా నోనాకేరా గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ ప్రధాన్ (40), క్లీనర్ అదే జిల్లా మాణికీపూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ బెహరా (39), అట్టల లోడు లారీ డ్రైవర్ రాయగడ జిల్లా జిమ్మిడిపేట గ్రామానికి చెందిన వన్నాల గౌరీ శంకర్ (38) గా గుర్తించారు. అలాగే ఈ లారీ క్లీనర్ ఢిల్లీశ్వరరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అనంతరం సంబంధిత లారీ యజమానులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలంలో రోడ్డుకు అడ్డంగా పడిన లారీలను పోలీసులు పక్కకు జరిపి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని ట్రాఫిక్ ఏడీసీపీ కే. ప్రవీణ్ కుమార్, ఏసీపీలు వాసుదేవరావు, పెంటారావు, సీఐలు కాంతారావు, టీవీ తిరుపతిరావు తదితరులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేపల లోడ్ లారీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు పోలీసులు తరలించారు.
-జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు