తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kodali Nani On Attacks : రెండు రోజుల్లో వైసీపీ నేతలు రోడ్లపైకి, దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం- కొడాలి నాని

Kodali Nani On Attacks : రెండు రోజుల్లో వైసీపీ నేతలు రోడ్లపైకి, దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం- కొడాలి నాని

08 June 2024, 17:35 IST

google News
    • Kodali Nani On Attacks : కౌంటింగ్ తర్వాత టీడీపీ, జనసేన శ్రేణులు...వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. హైకోర్టుకు వెళ్లి బాధ్యులపై ప్రైవేట్ కేసులు పెడతామన్నారు.
దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం- కొడాలి నాని
దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం- కొడాలి నాని

దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం- కొడాలి నాని

Kodali Nani On Attacks : కౌంటింగ్ ముగిసిన తర్వాత టీడీపీ, జనసేన నాయకులు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. పార్టీ తరఫున హైకోర్టుకు వెళ్లి దాడులపై ప్రైవేట్ కేసులు వెయ్యబోతున్నామన్నారు. ప్రతీ ఒక్క కార్యకర్తకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. మరో రెండు రోజుల్లో రోడ్ల మీదకి వస్తామని, దాడి జరిగిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.

ప్రైవేట్ కేసులు పెడతాం

"కౌంటింగ్ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయి. వైసీపీ శ్రేణుల ఇళ్లు, ఆస్తులపై టీడీపీ, జనసేన శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయి. అర్ధరాత్రుళ్లు వారి ఇళ్ల పైకి వెళ్లి రాళ్లు రువ్వుతూ, కార్లు పగలగొడుతున్నారు. వైసీపీ భూస్థాపితం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల వ్యక్తులపై దాడులు చేస్తు్న్నారు. ఊర్లు విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. ఈ ఘటనలకు పోలీసులు ప్రత్యక్ష సాక్షులు. టీడీపీ, జనసేన దాడులు చూస్తుంటే వారికి కట్టడి చేయకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, గొడవలకు సంబంధించి ముందు సమాచారం ఉండి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదు. మా ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయడంలేదు. అందుకే మా వద్ద ఉన్న ఫొటో, వీడియో ఆధారాలతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు"-కొడాలి నాని

పోలీసుల ప్రేక్షక పాత్ర

వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదని కొడాలి నాని అన్నారు. ముఖ్య నాయకులు అందరూ నియోజకవర్గాల్లో పర్యటిస్తామన్నారు. దాడుల్లో గాయపడిన వారి ఇళ్లకు వెళ్లి వారికి ధైర్యం చెబుతామన్నారు. పార్టీ అధినేత జగన్ కూడా ఇప్పటికే ఈ విషయంపై దిశానిర్దేశం చేశారన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. దాడులను చూస్తూ ఊరుకోవద్దని, అందరూ కలిసి కట్టుగా ఓ వేదికపైకి వచ్చి తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారన్నారు. పోలీసు వ్యవస్థ ఒక అసమర్థ వ్యవస్థగా మారిపోయి, దాడులు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకలు రెండ్రోజుల్లో నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తు పోలీసులే బాధ్యత వహించాలన్నారు.

టీడీపీ వర్సెస్ వైసీపీ

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అనంతరం కూటమి పార్టీల మద్దతుదారులు వైసీపీ శ్రేణుల లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమపై ఇదే తరహాలో దాడులకు పాల్పడ్డారని, అందుకు ప్రతికార చర్యలుగా ఈ దాడులు చేస్తున్నట్లు కొందరు నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులకు యత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన దేవినేని అవినాష్ ఇంటిపై దాడి జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. శాంతి భద్రతలను అదుపు చేయాలని, వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడినా టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్... వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని, గవర్నర్ కల్పించుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు.

తదుపరి వ్యాసం