PG Admissions: జీవో నంబర్ 77 ఎఫెక్ట్.. అనుబంధ కాలేజీల్లో తగ్గిన పీజీ అడ్మిషన్లు, సరిచేయని కూటమి సర్కారు
21 August 2024, 7:27 IST
- PG Admissions: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయి. గత నాలుగేళ్లుగా తగ్గిపోతున్న అడ్మిషన్లు ఈ ఏడాది దారుణంగా పడిపోయాయి. ఐసెట్ 2024 కౌన్సిలింగ్ మునుపెన్నడూ లేని విధంగా అడ్మిషన్లు తగ్గిపోయాయి.ఫీజు రియింబర్స్‌మెంట్ లేక ఉన్న సీట్లలో మూడో వంతు కూడా భర్తీ కాలేదు.
పీజీ కోర్సుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్ రద్దు చేస్తూ జారీ చేసిన జీవో
PG Admissions: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలో గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు వికటించాయి. ప్రభుత్వ కాలేజీలు, యూనివర్శిటీ అనుబంధ కాలేజీల్లో మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేయాలనే నిర్ణయం పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉన్నత చదువులకు ఆటంకంగా మారింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసే పేరుతో జారీ చేసిన జీవో కాస్త పేదల పాలిట శాపంగా మారింది. యూనివర్శిటీ అనుబంధ కాలేజీలలో మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింప చేయడంతో పీజీ అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
పీజీ కోర్సులకు ఫీజు రియింబర్స్‌మెంట్ రద్దు చేయడంతో క్రమంగా కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. 2020లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 77 ను పునరుద్దరించాలని ఎన్డీఏ ప్రభుత్వానికి విద్యావేత్తలు, దళిత, బహుజన సంఘాలు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
2024-25 పీజీ అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన తాజా గణంకాల ప్రకారం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు 18,232కు పరిమితం అయ్యాయి. ఏఐసీటీఈ అనుమతి లభించిన సీట్లలో మూడో వంతు కూడా భర్తీ కాలేదు. పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు తగ్గిపోవడం ఇదే ప్రథమమని చెబుతున్నారు. 2020లో వైసీపీ ప్రభుత్వం పీజీ కోర్సుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో చేసిన మార్పులు కాలేజీల పాలిట శాపంగా మారాయి.
ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులను సైతం కేవలం క్యాంపస్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేసింది. 2019నాటికి చెల్లించాల్సి ఉన్న రూ.450కోట్లను విడుదల చేయలేదు. ఫీజులు కట్టలేక కొందరు, క్యాంపస్ కాలేజీల్లో చేరినా మెస్ ఫీజులు, ఇతర ఖర్చులు భరించలేక ఇంకొందరు మొత్తంగా పీజీ విద్యకు దూరం అయ్యారు.
డిగ్రీ కోర్సుల్లో ప్రభుత్వం చేసిన మార్పులు కూడా పీజీ అడ్మిషన్లపై ప్రభావం చూపుతోంది. ఏటా నాలుగు లక్షల మందికి పైగా ఇంటర్ విద్యార్ధులు బయటకు వస్తుంటే వారిలో సగం మంది కూడా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో సింగల్ మేజర్ సబ్జెక్టుతో డిగ్రీ కోర్సుల్ని ప్రవేశపెట్టింది. గతంలో కనీసం మూడు సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తి చేయాల్సి ఉండేది.
ఐసెట్‌లో మూడో వంతు సీట్లు భర్తీ…
ఏపీలోని ప్రభుత్వ, అనుబంధ కాలేజీల్లో ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ 2024 అడ్మిషన్ల కోసం మొత్తం 21,480 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 19,665 మంది మాత్రమే అడ్మిషన్లకు కాలేజీ ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారు. వారిలో 18,232 మందికి సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తం 62,076 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 46,454 సీట్లుంటే అందులో సగం కూడా భర్తీ కాలేదు.
ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు శాపం…
2020-21 విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు ఫీజు రియింబర్స్‌మెంట్ రద్దు చేస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. 2020 డిసెంబర్ 25వ తేదీన ఈ జీవో జారీ చేశారు. వరుసగా ఐదో ఏడాది కూడా ఈ జీవో పేద, బలహీన వర్గాల విద్యార్ధుల పాలిట శాపంగా మారుతోంది. జీవోను ఉపసంహరించుకోవాలని విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి వినతులు కూడా అందించాయి.
2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు ఫీజు రియింబర్స్‌మెంట్ రద్దు చేస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. ఏపీలో 2019లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియింబర్స్ మెంట్ పథకాలకు జగనన్నవిద్యా దీవెన, వసతిదీవెన పథకాలుగా పేర్లు మార్చారు.
2020 డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 77తో ప్రైవేట్ కాలేజీల్లో చదివే వారికి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు, పీజీ కోర్సులు, సాంకేతిక కోర్సుల్లో ఫీజుల చెల్లింపు రద్దు చేశారు. ఎంబిఏ, ఎంసిఏ వంటి కోర్సులతో పాటు అన్ని రకాల పీజీ కోర్సులు, సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సులు ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింప చేయాలని నిర్ణయించారు.
కన్వీనర్ కోటాలో ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్ధులకు మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేశారు. కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల్లో చేరినా పథకం వర్తించదని నిబంధన విధించారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు కూడా ఇవే నిబంధనలు వర్తింపచేశారు.
ఏపీలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్లుగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆంధ్రా, ఆదికవి నన్నయ్య, కృష్ణా, నాగార్జున, ఎస్కేయూ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల వంటి రాష్ట్ర ప్రభుత్వ వర్శిటీల పరిధిలో ఉన్న క్యాంపస్ కాలేజీలు, పీజీ కాలేజీలలో మాత్రమే విద్యార్దులకు ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది.
ప్రైవేట్ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే పీజీ విద్యార్దులకు 2017-18 విద్యా సంవత్సరం నుంచి గత ప్రభుత్వం ఫీజుల చెల్లింపు చేయకపోవడంతో చాలా మంది ఇప్పటికీ కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికెట్లు అందని పరిస్థితిలో ఉన్నారు. విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేసే సమయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో బీసీ వర్గాలకు లేని పూర్తి రాయితీలు ఎస్సీ, ఎస్టీలకు ఎందుకని భావించడంతో వాటిని రద్దు చేయాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్టు తెలుస్తోంది.
పీజీ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సుల ఫీజు రియింబర్స్‌మెంట్, మెస్ ఛార్జీల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజు రాయితీ వర్తింపచేయడం అదే సమయంలో బీసీలు ఇతర వర్గాల విద్యార్ధులకు ఆ అవకావం లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీలకు కూడా ఆ సదుపాయాన్ని రద్దు చేయాలనే గత ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా గత ప్రభుత్వ ముఖ్యమైన వ్యకి తన ఆదేశాలు అమలు చేయాల్సిందేనని పీజీ కోర్సుల్లో ఫీజు రియంబర్స్‌మెంట్ రద్దు చేయాలని స్పష్టం చేయడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయారు.
చేటు చేస్తున్న సంస్కరణలు….
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగంలో సంస్కరణల్లో భాగంగా స్కాలర్‌షిప్‌ల దుర్వినియోగంపై దృష్టి సారించి కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో అక్రమాలు జరగడంతో వాటిని కట్టడి చేయడం బదులు అసలు పథకాన్ని ఎత్తేయాలని అప్పటి ప్రభుత్వ బాధ్యులకు సూచించినట్టు తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తిని కొందరు అధికారులు, సలహాదారులు తప్పు దోవ పట్టించడంతో ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలకు రియింబర్స్‌మెంట్ నిలిపివేయాలని నిర్ణయించారు. ఫలితంగా లక్షలాది మంది విద్యార్ధులు గ్రాడ్యుయేషన్‌తో చదువు ముగించాల్సి వచ్చింది. హాస్టల్ సదుపాయం, స్కాలర్‌షిప్‌ల కోసమే చాలా మంది అడ్మిషన్లు పొందుతున్నారనే అభిప్రాయాన్ని జీవో నంబర్ 77 జారీ చేసే సమయంలో వైసీపీ ముఖ్యనేత భావించడంతో భావనను ముఖ్యమైన వ్యక్తికి కల్పించడంతో జీవోను నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులకు ఉన్నత చదువులు చదివే అవకాశాలను దూరం చేసే జీవో నంబర్ 77 రద్దు చేయాలని కొత్త ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ముఖ్యమంత్రి కార్యాలయ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో అమలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఈ ఏడాది కూడా విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. తాజాగా ఐసెట్ అడ్మిషన్లే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.