AP Fee ReImbursement: జీవో 77.. పేదలకు మిథ్యగా మారిన ఉన్నత విద్య..-go number 77 is keeping the poor away from higher education in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Fee Reimbursement: జీవో 77.. పేదలకు మిథ్యగా మారిన ఉన్నత విద్య..

AP Fee ReImbursement: జీవో 77.. పేదలకు మిథ్యగా మారిన ఉన్నత విద్య..

HT Telugu Desk HT Telugu
Jul 27, 2023 01:42 PM IST

AP Fee ReImbursement: ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద, బలహీన వర్గాల విద్యార్దుల పాలిట జీవో నంబర్ 77 శాపంగా మారింది. యూనివర్శిటీ క్యాంపస్‌లు, ప్రభుత్వ కాలేజీలకు మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్‌ వసూలు చేస్తుండటంతో వందలాది మంది ఉన్నత విద్యకు దూరం కావాల్సి వస్తోంది.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 77పై విద్యార్ధుల అసంతృప్తి
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 77పై విద్యార్ధుల అసంతృప్తి

AP Fee ReImbursement: “నా ఎస్సీ, ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు” అంటూ తరచుగా ప్రసంగాల్లో ప్రస్తావించే ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదికే జారీ చేసిన ఓ జీవో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అయా వర్గాల విద్యార్ధుల పాలిట శాపంగా మారింది.

2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. ఏపీలో 2019లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియింబర్స్‌ మెంట్ పథకాలకు జగనన్నవిద్యా దీవెన, వసతిదీవెన పథకాలుగా పేర్లు మార్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో విద్యా రంగంలో వినూత్న మార్పులు తీసుకు వచ్చారు. వీటిలో ప్రధానంగా పిల్లల్ని బడికి పంపే కుటుంబాలకు ఆర్ధిక భరోసా ఇవ్వడం కోసం ప్రతి ఇంటికి అమ్మఒడి పేరుతో రూ.15వేలు చెల్లిస్తున్నారు.

ఇంటర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్దులకు జగనన్న వసతి దీవెన పేరుతో మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. పేదల తలరాతల మార్చేలా విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ చెబుతుంటారు. ఆచరణలో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 77
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 77

2020 డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 77తో ప్రైవేట్ కాలేజీల్లో చదివే వారికి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు, పీజీ కోర్సులు, సాంకేతిక కోర్సుల్లో ఫీజుల చెల్లింపు రద్దు చేశారు. ఎంబిఏ, ఎంసిఏ వంటి కోర్సులతో పాటు అన్ని రకాల పీజీ కోర్సులు, సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సులు ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింప చేయాలని నిర్ణయించారు.

ఏపీలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్లుగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆంధ్రా, ఆదికవి నన్నయ్య, కృష్ణా, నాగార్జున, ఎస్కేయూ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న క్యాంపస్ కాలేజీలు, పీజీకాలేజీలలో మాత్రమే విద్యార్దులకు ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది.

ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు 2017-18 విద్యా సంవత్సరం నుంచి గత ప్రభుత్వం ఫీజుల చెల్లింపు చేయకపోవడంతో చాలా మంది ఇప్పటికీ కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికెట్లు అందని పరిస్థితిలో ఉన్నారు. విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేసే సమయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో బీసీ వర్గాలకు లేని పూర్తి రాయితీలు ఎస్సీ, ఎస్టీలకు ఎందుకని భావించడంతో వాటిని రద్దు చేయాలనే నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.

పీజీ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సుల ఫీజు రియింబర్స్‌మెంట్‌, మెస్ ఛార్జీల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజు రాయితీ వర్తింపచేయడం అదే సమయంలో బీసీ విద్యార్ధులకు ఆ అవకావం లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీలకు రద్దు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు.

విద్యార్దులకు చేటు చేస్తున్న సంస్కరణలు….

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగంలో సంస్కరణల్లో భాగంగా స్కాలర్‌షిప్‌ల దుర్వినియోగంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వం ముఖ్యమైన వ్యక్తిని కొందరు అధికారులు, సలహాదారులు తప్పు దోవ పట్టించడంతో ప్రైవేట్, ఎయిడెడ్‌ కాలేజీలకు రియింబర్స్‌మెంట్‌ నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హాస్టల్‌ బస సదుపాయం, స్కాలర్‌షిప్‌ల కోసమే చాలా మంది అడ్మిషన్లు పొందుతున్నారనే భావనను ముఖ్యమైన వ్యక్తికి కల్పించడంతో వాటిని నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సాంకేతిక విద్య, ప్రొఫెషనల్ కోర్సుల్లో అవకాశాలు తగ్గిపోతే ఎస్సీ, ఎస్టీ విద్యార్దులు నష్టపోతారని సర్ది చెప్పే ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రిని ఒప్పించేందుకు కొందరు అధికారులు ప్రయత్నించినా అవి నెరవేరలేదని ప్రచారం జరుగుతోంది.

మంచి చేస్తోందా… చేటు చేస్తోందా..?

యూనివర్శిటీలలో విద్యాభ్యాసం పేరుతో కొంతమంది ఏళ్ల తరబడి తిష్ట వేస్తుండటంతో చాలామందికి సీట్లు దక్కని పరిస్థితులు చాలా వర్శిటీల్లో ఉన్నాయి. దాదాపు 15-20ఏళ్ల క్రితమే ఈ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు సంస్కరణలు చేపట్టాయి. ఒక విద్యార్ది ఒకటే కోర్సుకు స్కాలర్‌షిప్ వర్తింప చేయాలనే నిర్ణయం 2008లో అమల్లోకి వచ్చింది. అంతకు ముందు ఆంధ్రా యూనివర్శిటీలో వీసీ సింహాద్రి ఇదే తరహా నిర్ణయాన్ని అమలు చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి.

మరోవైపు ప్రైవేట్ కాలేజీలు, అన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్దుల్లో చాలామంది తరగతులకు హాజరు కాకపోవడం, కోర్సులను పూర్తి చేయడం కోసమే స్కాలర్‌షిప్‌లను దుర్వినియోగం చేస్తున్నారనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది నిజంగా అర్హులైన విద్యార్దుల అవకాశాలను కూడా గండికొడుతోంది. ఫీజులు చెల్లించలేని విద్యార్దులు ప్రొఫెషనల్ విద్యకు పూర్తిగా దూరం అవుతున్నారు.

డిగ్రీ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులైన ఎంబిఏ, ఎంసిఏ వంటి కోర్సులతో పాటు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్ వంటి కోర్సుల్లో క్యాంపస్ కాలేజీల్లో ప్రతికోర్సులో 30కు మించి సీట్లు ఉండవు. రాష్ట్రం మొత్తం ఉన్న యూనివర్శిటీల సంఖ్యను పరిగణలోకి తీసుకున్నా విద్యార్ధుల అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ పరిణామాలను అంచనా వేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు 2019కు ముందు అడ్మిషన్లు పొంది, కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు చేతికి అందక ఇబ్బంది పడుతున్నారు.

డ్యుయల్ డిగ్రీ కోర్సులకు రియింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్న నాగార్జున వర్శిటీ
డ్యుయల్ డిగ్రీ కోర్సులకు రియింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్న నాగార్జున వర్శిటీ

ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల్లో సాధారణ సబ్జెక్టుల ఫీజులు అందుబాటులో ఉన్నా, ఉపాధి కల్పించే కోర్సులు సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సులు, ఎంటెక్, హోటల్ మేనేజ్‌మెంట్‌ ,టూరిజం వంటి కోర్సుల ఫీజులు ఏడాదికి రూ.70వేల నుంచి లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తుంటారు.ఇక కొన్ని యూనివర్శిటీల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీలతో పాటు ఎంటెక్‌ కోర్సులను కలిపి ఇంటిగ్రేటెడ్‌ కోర్సులుగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కోర్సులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ వర్తించదని అయా వర్శిటీలు ప్రకటిస్తున్నాయి.

ప్రైవేట్ కాలేజీల్లో భారీ ఫీజులు చెల్లించి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసే పరిస్థితి అందరికి సాధ్యమయ్యేది కాదు. ముఖ‌్యమంత్రి తన వాళ్లుగా చెప్పుకునే ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలకు అసలే సాధ్యం కాదు. గతంలో ఒక్క పీజీకి మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేయడం ద్వారా అక్రమాలు చాలా వరకు అడ్డు కట్ట పడినా ఏకపక్షంగా సిఎం నిర్ణయం తీసుకున్నారని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

బకాయిలు చెల్లించామంటున్న ప్రభుత్వం….

2017 సం॥ నుండి గత ప్రభుత్వ బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ఇప్పటి వరకు ప్రభుత్వం 14,912.43 కోట్లు ఖర్చు చేసిందని చెబుతోంది.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన ఖర్చు రూ.59,331.22 కోట్లని ప్రకటించింది. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు భోజన వసతి సౌకర్యాలకు వసతి దీవెన, కూడా ఆర్థిక సాయం అందిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అందిస్తున్నామని చెబుతోంది.

అయితే ప్రభుత్వ ఫీరియింబర్స్‌మెంట్‌ డిగ్రీ కోర్సులు, యూనివర్శిటీ క్యాంపస్‌ కాలేజీలకు మాత్రమే దానిని పరిమితం చేసింది. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు అమ్మఒడి, ఆ తర్వాత డిగ్రీ స్థాయి వరకే ఫీజులు చెల్లిస్తుండటంతో డిగ్రీ, ఇంజనీరింగ్ తర్వాత చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Whats_app_banner