Konaseema : కోనసీమ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. జనసేన మీటింగ్‌లో రాపాక వరప్రసాద్ ప్రత్యక్షం!
13 October 2024, 16:14 IST
- Konaseema : కోనసీమ రాజకీయాల్లో కొత్త సీన్ కనిపించింది. జనసేన మీటింగ్‌లో రాపాక వరప్రసాద్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. 2024లో వైసీపీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీచేసిన నేత.. జనసేన మీటింగ్‌లో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
జనసేన మీటింగ్‌లో రాపాక వరప్రసాద్
జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక ప్రత్యక్షం అయ్యారు. మలికిపురంలో జనసేన కార్యక్రమానికి హాజరైన రాపాక.. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలిశారు. 2019లో జనసేన తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లిన రాపాక.. 2024లో అమలాపురం వైసీపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల ఆయన కూటమి నేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రాపాక వరప్రసాద్ త్వరలోనే టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఓసారి రాపాక వరప్రసాద్.. దేవ వరప్రసాద్‌ను కలిశారు. దీంతో ఆయన కూటమిలో చేరడం ఖాయమనే చర్చ జరిగింది. తాజాగా.. మళ్లీ జనసేన మీటింగ్‌లోని కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఆయన ఓ ఇష్యూపై తనను కలిశారని జనసేన ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రాజోలు నియోజకవర్గంలో ఓ కాలేజీ అధ్యాపకులు ఆందోళన చేస్తున్నారని.. ఆ అంశంపైనే చర్చించేందుకు రాపాక వచ్చారని దేవ వరప్రసాద్ స్పష్టం చేశారు. రాపాక వరప్రసాద్ 2019లో జనసేన నుంచి రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. అప్పుడు జనసేన క్యాడర్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాపాక మళ్లీ రాజోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ.. అక్కడ ఓడిపోతారని.. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో.. 2024లో అమలాపురం ఎంపీగా పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ సమావేశాల్లో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆయన జనసేన లేదా టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది.
టీడీపీకి మంచి బలం ఉన్న నియోజకవర్గం అయిన రాజోలులో.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పార్టీని చూసుకున్నారు. జనసేన 2019లో గెలిచిన స్థానం కావడంతో టీడీపీ ఆశలు వదులుకుంది. గొల్లపల్లి సూర్యారావు తన కుమార్తెను జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇస్తే గెలుపు ఖాయమని కూటమి నేతలకు చెప్పారు.
అమూల్య భర్త బిసి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. ఆ వర్గం నుండి మెజారిటీ ఓట్లు తెచ్చుకుంటుదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అయితే గొల్లపల్లి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే.. నియోజకవర్గం టీడీపీకి ఇచ్చినట్లేనని జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దేవ వరప్రసాద్‌కు టికెట్ లభించింది. ఆయన విజయం సాధించారు.