AP Liquor Shops : వైన్ షాప్ నిర్వాహకులకు అలర్ట్.. ఏమాత్రం తేడా వచ్చినా రూ.5 లక్షల ఫైన్ తప్పదు!
17 November 2024, 14:25 IST
- AP Liquor Shops : ఏపీలో నూతన మద్యం పాలసీ అందుబాటులోకి వచ్చింది. కానీ.. మందుబాబులను మోసం చేయడం మాత్రం ఆగడం లేదు. చాలాచోట్ల ఎమ్మార్వీ ధరల కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
వైన్ షాప్ నిర్వాహకులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి మద్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరు గ్రామాల్లో దందా చేస్తుంటే.. లిక్కర్ వ్యాపారులు వైన్ షాపుల ద్వారా మోసాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలాచోట్ల ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తూ.. మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయ్యింది.
కొత్త మద్యం పాలసీ అమలులోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం.. వేలాది మద్యం దుకాణాలకు అనుమతులిచ్చింది. లక్షలు వెచ్చించి వ్యాపారులను షాపులను దక్కించుకున్నారు. దీంతో ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. ఈ విషయం తెలిసి.. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీని పకడ్బందీగా అమలుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. ఒక్క రూపాయికి అధికంగా అమ్మినా రూ.5 లక్షల జరిమానా విధించాలని.. మళ్లీమళ్లీ అదే పని చేస్తే.. అనుమతులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచారు. ఎమ్మార్పీ ధరల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
మరోవైపు గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పడ్డాయి. అక్రమ ఆదాయం కోసం గ్రామాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. దీంతో ఘర్షణలు జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో మహిళలే బెల్టు షాపులు నడుపుతున్నారు. గొలుసు దుకాణాలపై కూడా ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు.
ఇటు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి అధికంగా టెట్రా ప్యాకెట్ల మద్యం రవాణా అవుతోంది. దీని ప్రభావం రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉంది. దీంతో అధికారులు చెక్ పోస్టులను పటిష్ఠ పరిచేలా చర్యలు తీసుకుంటున్నారు.
సిండికేట్ అండ..
ఎక్సైజ్ అధికారులు ఎన్ని దాడులు చేసినా.. కేసులు నమోదు చేసినా.. అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. దీనికి కారణం సిండికేట్ అండ అనే టాక్ ఉంది. సిండికేట్ నిర్వాహకులే గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారికి లోకల్‌గా పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. దీంతో అధికారులు కూడా గట్టిగా చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.