Dy CM Pawan Kalyan : ఐఏఎస్ లను బెదిరిస్తే సుమోటో కేసులు, షర్మిల కోరితే పోలీస్ భద్రత - పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Dy CM Pawan Kalyan : ఐఏఎస్ అధికారులను బెదిరిస్తే సుమోటోగా కేసులు పెడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోమన్నారు. అలాగే షర్మిల కోరితే భద్రత కల్పిస్తామన్నారు. మహిళల భద్రత విషయంలో అందరూ ముందుకు రావాలన్నారు.
తమది మంచి ప్రభుత్వమే కానీ, మెతక ప్రభుత్వం కాదని ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరులో అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..అమర వీరులకు నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించారు. వైసీపీ శ్రేణులను అక్రమంగా నిర్బంధిస్తే వదిలేది లేదని పోలీసులు, అధికారులకు మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఐఏఎస్ అధికారులను బెదిరిస్తే సుమోటోగా కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోమన్నారు. తామే 20 ఏళ్లు అధికారంలో ఉంటామని అధికారులను మభ్యపెట్టి ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
షర్మిల కోరితే భద్రత కల్పిస్తాం
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరితే ఆమెకు భద్రత కల్పిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. గంజాయిని మన్యంతో పాటు రెవెన్యూ భూముల్లో కూడా సాగుచేస్తున్నారని పవన్ అన్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దండీ మార్చ్ తరహాలో అటవీ అమరవీరులకు పెద్ద స్తూపాలు నిర్మించి నివాళులర్పిస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అడవులను రక్షించేందుకు ఎలాంటి సహాయమైనా అధికారులను అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ అధికారులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నామన్నారు.
అమరుల పేర్లపై బ్లాకులు, విగ్రహాలు
అటవీ శాఖలో విధుల నిర్వహిస్తూ 23 మంది అమరులయ్యారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అటవీశాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోకూడదన్నారు. వివిధ వర్గాల నుంచి అటవీశాఖకు రూ.5 కోట్ల విరాళం సేకరించి అందిస్తామన్నారు. అటవీ అమరులకు పెద్ద స్తూపాలు నిర్మించి నివాళులర్పిద్దామన్నారు. అమర వీరుల స్మరణకు ఫారెస్ట్ ఆఫీస్ బ్లాక్‌లకు అమరుల పేర్లు పెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. అటవీ శాఖ అధికారులు ఎందరో స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారన్నారు.
వీరప్పన్ ను ఎదురించిన అధికారులు
అడవులను రక్షించడంలో అటవీ అధికారుల పాత్ర కీలకమని పవన్ అన్నారు. వీరప్పన్ వంటి వారితో పోరాటం చేసిన ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారన్నారు. స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. అటవీశాఖ తరపున అమరుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ కొంతమంది అటవీ అధికారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. చెట్లను నరుకుతుంటే అడ్డుకుని వారి తలలే బలి ఇచ్చిన చరిత్ర ఐఎఫ్ఎస్ అధికారులకు ఉందన్నారు. అటవీ సంరక్షణ అందరి కర్తవ్యమని, నేటి తరం, భవిష్యత్తు తరాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అటవీ శాఖలో ఎలాంటి సంస్కరణలు చేపట్టినా తన మద్దతు ఉంటుందన్నారు. అటవీ శాఖకు అవసరమైన నిధులు సీఎం చంద్రబాబుతో మాట్లాడి మంజూరు చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
సంబంధిత కథనం