Rajya Sabha Byelection : ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నిక, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
26 November 2024, 18:56 IST
Rajya Sabha Byelection : దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 5 రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఈసీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 20న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఏపీ మూడు రాజసభ్య స్థానాలకు ఉపఎన్నిక, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వగా, ఒడిశా, బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉపఎన్నికల నిర్వహించనున్నారు. రాజ్యసభ ఉపఎన్నికలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ అవకాశం కల్పించింది. డిసెంబర్ 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ముగ్గురు రాజ్యసభ సభ్యుల రాజీనామాతో
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య ఇటీవల తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 164 సీట్లు గెలుచుకున్నారు. వైసీపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. దీంతో వైసీపీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు ఛాన్స్ లేదు. మూడు రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలే కైవసం చేసుకోనున్నాయి. ఈ స్థానాలు కూటమి పార్టీలు పంచుకుంటాయా? టీడీపీ తనకే కావాలని పట్టుబడుతుందో వేచిచూడాలి.
ఏపీకి 11 రాజ్యసభ స్థానాలు
ఆంధ్రప్రదేశ్ కు రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి. 2019 అధికారం చేపట్టిన వైసీపీ ఈ 11 స్థానాలు కైవసం చేసుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాభవంతో వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఆ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేరు. తాజా ఉపఎన్నికలో మళ్లీ టీడీపీకి రాజ్యసభలో అవకాశం దక్కనుంది.
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు... టీడీపీలో చేరారు. వీరు తిరిగి రాజ్యసభ సీట్ల హామీలతోనే వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. మూడు సీట్లలో రెండు వీరికి కేటాయించిన మిగిలిన సీటు కోసం జనసేన పట్టుబట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు తీసుకున్న జనసేన... సీట్లు దక్కని నేతలకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ప్రాధాన్యత దక్కుతుంది. అలాగే రాజ్యసభలో కూడా జనసేనకు అవకాశం దక్కుతుందా? లేదో వేచి చూడాలి.