Nuzvid IIIT : విద్యార్థులకు అస్వస్థత.. నారా లోకేష్ సీరియస్.. క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం!
02 September 2024, 5:12 IST
- Nuzvid IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటీలో దాదాపు 1300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఇష్యూను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంగా విద్యా శాఖ మంత్రి లోకష్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. ఫుడ్ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధమైంది.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థతపై లోకేష్ సీరియస్
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలుషితాహారం ఘటనపై విచారణ కమిటీ కీలక సిఫారసులు చేసింది. దీంతో ప్రస్తుతం ఆ క్యాంపస్‌లో కేటరింగ్ సేవలు అందిస్తున్న ఎం.ఎస్ పైన్ క్యాటరింగ్ సర్వీసెస్, అనూష హాస్పటాలిటీ సేవలను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిపై క్రిమినల్ చర్యలకు విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టు చేయాలని స్పష్టం చేశారు. కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు.. విద్యార్థులందరికీ ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా వేరే సంస్థ క్యాటరింగ్ సేవలను ఉపయోగించుకోవాలని నూజివీడు ట్రిపుల్ ఐటి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఫుడ్ కోర్టు మూసేయాలి..
క్యాటరింగ్ కోసం కొత్త టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. కమిటీ సిఫారసు మేరకు నూజివీడు ట్రిపుల్ ఐటిలోని ఫుడ్ కోర్టును తక్షణమే మూసివేయాలని ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్నఫుడ్ కోర్టు అద్దెను రెండు వారాల్లోగా ఏజెన్సీ నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. బయటి ఆహారాన్ని క్యాంపస్‌లోకి అనుమతించవద్దని మంత్రి లోకేష్ ట్రిపుల్ ఐటి అధికారులను ఆదేశించారు. ఫుడ్ కోర్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలని లోకేష్ ట్రిపుల్ ఐటి అధికారులకు సూచించారు.
గతంలోనూ ఫిర్యాదులు..
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలుషితాహారం తిని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ సభ్యులు.. మెస్, హాస్టల్ ప్రాంగణాలను పరిశీలించారు. ట్రిపుల్ ఐటీలో క్యాటరింగ్ సేవలు నిర్వహిస్తున్న ఎం.ఎస్ పైన్ కేటరింగ్ సర్వీసెస్, అనూష హాస్పటల్ సర్వీసెస్ సంస్థలు.. కళాశాలలో ఆరు డైనింగ్ హాళ్లలో ఆహారాన్ని అందిస్తుండగా.. వారిపై గతంలోనే పలు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ఆహార నాణ్యతపై మూడు నోటీసులు జారీ చేసినా.. తీరు మారలేదు. మెస్ కమిటీలు సూచించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించినా.. నిర్వాహకులు వాటిని పెడచెవిన పెట్టారని కమిటీ నివేదిక ఇచ్చింది.
కమిటీ నివేదికలో కీలకాంశాలు..
ప్రభుత్వం నియమించిన కమిటీ.. ఆరు డైనింగ్ హాళ్లను సందర్శించింది. అధికారుల విచారణలో 7 ముఖ్యమైన సమస్యలను గుర్తించారు. నాలుగు డైనింగ్ హాళ్లకు ఒకే వంటగదిని వాడుతున్నారు. వంటశాలలో స్థల వినియోగం సరిగా లేదు. వంటశాలను స్టీమ్ కుకింగ్ తోపాటు వాషింగ్ కూడా వినియోగిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
వంటగది ప్రాంతం బొద్దింకలతో నిండి ఉండి, నిర్వహణ సరిగా లేదు. ప్లేట్లు , పాత్రలను శుభ్రం చేయడానికి సరైన పద్ధతులు అనుసరించడం లేదు. దీనివల్ల ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉంది. వంటగది గోడలు, కిటికీలు గ్రీజు, ఫంగస్ తో కప్పబడి అపరిశుభ్రంగా ఉన్నాయి. బియ్యం, వేరుశెనగ, మినపప్పు వంటి వంటసరుకులు పురుగు పట్టి ఉన్నాయి. వంటశాలలో కుళ్లిన గుడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆహార నాణ్యత విషయంలో ఆందోళనకరమైన అంశాలుగా కమిటీ సభ్యులు గుర్తించారు.
నిరంతరం పర్యవేక్షణ ఉండాలి..
నూజివీడు ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు చక్కపడేవరకూ ఆర్డీవో నిరంతరం పర్యవేక్షణ చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులతో నిత్యం మాట్లాడుతూ.. ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తు లో ఇటువంటి ఘటనలు జరగకుండా.. విద్యార్థుల అస్వస్థతకు కారణం అయిన క్యాటరింగ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు