Darshi: ప్రకాశం జిల్లాలో విషాదం.. సాగర్ కెనాల్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు
Darshi: ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. సాగర్ కెనాల్‌లో ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యంమైంది. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ప్రకాశం జిల్లా దర్శిలోని సాగర్ కెనాల్‌లో ఈత కొట్టడానికి ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు వెళ్లారు. ఈతకొట్టే క్రమంలో వారు గల్లంతయ్యారు. వీరి కోసం ఎంత గాలించినా దొరకలేదు. దీంతో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఇద్దరు ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం గాలిస్తున్నారు.
దర్శి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పోతిరెడ్డి డానియల్ రెడ్డి కుమారుడు పోతిరెడ్డి లోకేశ్వర్ రెడ్డి (19), లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటనారాయణ రెడ్డి కుమారుడు చందు కిరణ్ కుమార్‌రెడ్డి (18), కొర్లమడుగు గ్రామానికి చెందిన భక్తుల జయరామిరెడ్డి కుమారుడు మణికంట రెడ్డి (18) స్నేహితులు. వీరందరు కలిసే ఈతు వెళ్లారు.
లోకేశ్వర్ రెడ్డి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కిరణ్ కుమార్ రెడ్డి చదువుతున్నాడు. నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో మణికంఠ రెడ్డి రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు ముగ్గురూ కలిసి శనివారం లోకేశ్వరరెడ్డి బంధువుల వివాహానికి కొత్తపల్లి వెళ్లారు. అక్కడి నుంచి దర్శిలోని సాగర్ బ్రాంచ్ కెనాల్‌కు వెళ్లి ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురూ గల్లంతయ్యారు. లోకేశ్వర్ రెడ్డి మృతదేహం మాత్రమే లభ్యమైంది.
డెంగీ జ్వరంతో ఇద్దరు మృతి..
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం బిత్రపాడు పంచాయతీ బట్లభద్ర గ్రామంలో.. డెంగీ జ్వరంతో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 15 రోజుల కిందటే మరణించారు. దీంతో 15 రోజుల వ్యవధిలోనే ఒకే గ్రామంలో ముగ్గరు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
బట్లబద్ర గ్రామానికి చెందిన మేరువ పరధామ భార్య మేరువ దుర్గ (47), కుమార్తె చైతన్య (20) డెంగీ జ్వరం బారిన పడ్డారు. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో.. టెస్టులు చేయగా డెంగీ జ్వరం అని తేలింది. పార్వతీపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా నయం కాలేదు. కూమార్తెను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కూడా తగ్గలేదు. ఇద్దరూ బాగా నీరసించిపోయి మృతిచెందారు.
( రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)