YSRCP Central Office : తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత
22 June 2024, 9:01 IST
- YSRCP Central Office Demolition : తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం కూల్చివేయటాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు.
వైసీపీ ఆఫీస్ కూల్చివేత
YSRCP Central Office Demolition : రాష్ట్ర రాజధాని ప్రాంతం పరిధిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేసింది. శనివారం తెల్లవారు జామున ఈ కూల్చివేతలు ప్రారంభమైయ్యాయి. అయితే దీనిపై కోర్టు వెళ్తామంటూ వైసీపీ చెబుతుతోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేయడం దారుణమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కక్షపూరితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కూల్చివేసిందని దుయ్యబట్టారు.
తెల్లవారుజాము నుంచే…!
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) అధికారులు కూల్చివేస్తున్నారు. శ్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెల్లవారు జామున 5ః30 గంటల నుంచి భారీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చి వేతలు ప్రారంభించింది. బుల్డోజర్లు, పొక్లెయినర్లను ఉపయోగించి భవన కూల్చివేత పనులు మొదలు పెట్టారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభించారు. అయితే నిర్మాణం అక్రమం అంటూ ఇటీవలి సీఆర్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కూల్చివేతకు సీఆర్‌డీఏ తయారు చేసిన ప్రాథమిక ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ వైసీపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది.
దీన్ని విచారించిన హైకోర్టు చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని సీఆర్‌డీఏని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వైసీపీ తరపు న్యాయవాది సీఆర్‌డీఏ కమిషనర్‌కు తెలిపారు. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం… వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తూ కూటమి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ కోర్టు ధిక్కారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.