Reservations hike: బిహార్ లో నితీశ్ ప్రభుత్వానికి షాక్; రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని రద్దు చేసిన పాట్నా హైకోర్టు
Reservations hike: బిహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పాట్నా హై కోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను పాట్నా హైకోర్టు రద్దు చేసింది.
Reservations hike: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను పాట్నా హైకోర్టు గురువారం రద్దు చేసింది. రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన పాట్నా హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.
బిహార్ ప్రభుత్వ నిర్ణయం చెల్లదు
బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50% నుంచి 65 శాతానికి పెంచుతూ 2023 నవంబర్లో నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాట్నా హై కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. అనంతరం, ఆ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం చెల్లదని పేర్కొంటూ జూన్ 20, గురువారం ఆదేశాలు జారీ చేసింది.
అది రాజ్యాంగ ఉల్లంఘనే
రిజర్వేషన్ల చట్టాల్లో చేసిన సవరణలు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయని పిటిషనర్ల వాదనతో పాట్నా హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మార్చిలో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తుది ఉత్తర్వులను జారీ చేసింది.
మొత్తం రిజర్వేషన్లు 75 శాతం
2023 నవంబర్లో, బీహార్ ప్రభుత్వం రెండు రిజర్వేషన్ బిల్లులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లుల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచారు. ఈ నిర్ణయంతో, రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. ఇందులో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) అదనంగా అందిస్తున్న 10% రిజర్వేషన్లు కూడా ఉన్నాయి.
కుల గణన తరువాత..
రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన సర్వే ఫలితాల తరువాత, ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (SC) కోటాను 20 శాతానికి, షెడ్యూల్డ్ తెగలు (ST) 2 శాతానికి, అత్యంత వెనుకబడిన తరగతుల (EBC) 25 శాతానికి, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కోటాను 18 శాతానికి పెంచింది. దీనిపై పలువురు హై కోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్ల పెంపు వివక్షాపూరితంగా ఉందని, ఆర్టికల్ 14,15,16 ద్వారా పౌరులకు కల్పించిన సమానత్వ ప్రాథమిక హక్కులను ఇది ఉల్లంఘిస్తుందని వారు పేర్కొన్నారు. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సవరణలు ఉల్లంఘిస్తున్నాయని, ఆ తీర్పు ద్వారా రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని 50% గా నిర్దేశించారని వారు పేర్కొన్నారు.