తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Special Status : ఏపీ ప్రత్యేక హోదాపై అఖిల‌ప‌క్షంలో లేవ‌నెత్తిన వైసీపీ, టీడీపీ మౌనంపై జైరాం రమేశ్ ప్రశ్నలు

AP Special Status : ఏపీ ప్రత్యేక హోదాపై అఖిల‌ప‌క్షంలో లేవ‌నెత్తిన వైసీపీ, టీడీపీ మౌనంపై జైరాం రమేశ్ ప్రశ్నలు

HT Telugu Desk HT Telugu

21 July 2024, 22:04 IST

google News
    • AP Special Status : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తింది. అయితే ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ మౌనంగా ఉంది.
ఏపీ ప్రత్యేక హోదాపై అఖిల‌ప‌క్షంలో లేవ‌నెత్తిన వైసీపీ, టీడీపీ మౌనంపై  జైరాం రమేశ్ ప్రశ్నలు
ఏపీ ప్రత్యేక హోదాపై అఖిల‌ప‌క్షంలో లేవ‌నెత్తిన వైసీపీ, టీడీపీ మౌనంపై జైరాం రమేశ్ ప్రశ్నలు

ఏపీ ప్రత్యేక హోదాపై అఖిల‌ప‌క్షంలో లేవ‌నెత్తిన వైసీపీ, టీడీపీ మౌనంపై జైరాం రమేశ్ ప్రశ్నలు

AP Special Status : పార్లమెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా దిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల ప‌క్ష స‌మావేశంలో వైసీపీ ఏపీ ప్రత్యేక హోదా అంశం లేవ‌నెత్తింది. అయితే అధికార టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. టీడీపీ మౌనంపై కాంగ్రెస్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి జైరాం ర‌మేష్ ప్రశ్నించారు. సోమ‌వారం నుంచి పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆదివారం కేంద్ర ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. అయితే స‌మావేశంలో ఏపీకి సంబంధించిన అధికార‌, ప్రతిప‌క్ష పార్టీల నుంచి లావు శ్రీకృష్ణదేవ‌రాయులు, గండి హ‌రీష్‌ (టీడీపీ), వి. విజ‌య‌సాయి రెడ్డి, పీవీ మిథున్ రెడ్డి (వైసీపీ) పాల్గొన్నారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ రాజ్యస‌భ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. అలాగే ఎన్నికల అనంతరం ఏపీలో చెలరేగుతున్న హింస, ప్రతిపక్షంపై జరుగుతున్న దాడులపై ఈ సమావేశంలో వైసీపీ ప్రస్తావించింది. వైసీపీతో పాటు బీహార్‌కు ప్రత్యేక హోదా కేటాయించాలని ఆర్‌జేడీ, జేడీయూ, ఎల్‌జేపీ డిమాండ్‌ చేశాయి. అలాగే ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ టీడీపీ మాత్రం ప్రత్యేక హోదాపై మౌనం దాల్చింది.

ఎన్‌డీఏ ప‌క్షాలు అడుగుతున్నా టీడీపీ మౌనం ఎందుకు?

ఎన్‌డీఏ ప‌క్షాలు జేడీయూ, ఎల్‌జేపీ పార్టీలు కూడా త‌మ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అయిన‌ప్పటికీ ఎన్‌డీఏ ప‌క్షంగా ఉన్న టీడీపీ మాత్రం ఎందుకు మౌనంగా ఉంద‌ని వివిధ ప‌క్షాలు ప్రశ్నిస్తున్నాయి. బీహార్ లో ఎన్‌డీఏలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న జేడీయూ, ఎల్‌జేపీ పార్టీలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఏపీలో ఎన్‌డీఏ కీల‌క భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా ఎందుకు డిమాండ్ చేయ‌టం లేద‌ని ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్ ప్రశ్నించారు.

ప్రత్యేక హోదాపై టీడీపీ మౌనం విచిత్రంగా ఉంది- జైరాం ర‌మేష్‌

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షం టీడీపీ డిమాండ్‌ చేయకపోవడాన్ని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ తప్పుపట్టారు. అఖిలపక్ష సమావేశంలో బీహార్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని జేడీయూ, వైసీపీ డిమాండ్ చేశాయని, అయితే "విచిత్రంగా టీడీపీ ఈ విషయంపై మౌనం ప్రదర్శించిందని ఆయ‌న అన్నారు. ఈ మేర‌కు జైరాం ర‌మేష్ ట్విట్టర్ లో స్పందించారు.

“రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఫ్లోర్ లీడర్‌ల అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. జేడీయూ నాయకుడు బీహార్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేశారు. విచిత్రమేమిటంటే ఈ విషయంపై టీడీపీ నేతలు మాత్రం మౌనం వహించారు” అని పేర్కొన్నారు.

బీజేపీతో టీడీపీ రాజీ - విజ‌య‌సాయి రెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఒక్కటే రాష్ట్ర అభివృద్ధికి ఏకైక పరిష్కారం. దీనిపై అధికార టీడీపీ మౌనంగా ఉంది. టీడీపీ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడం లేదు. బీజేపీతో రాజీ కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మాజీ సీఎం జగన్మోహ‌న్‌ రెడ్డి బుధవారం దిల్లీలో ధర్నా చేయనున్నారు” అని అన్నారు.

కేంద్రం మ‌ద్దతు మాకు కావాలి- లావు శ్రీ‌కృష్ణ దేవ‌రాయులు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు “ఇది ఒకటి రెండు డిమాండ్ల విషయం కాదు. అనేక సమస్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్‌లో శ్వేతపత్రం పెడతాం. మాకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలి” అని అన్నారు.

బీజేడీ నేత సస్మిత్ పాత్ర మాట్లాడుతూ తమ పార్టీ ఒడిశాకు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తుందన్నారు. “ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరిని పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేడీ, వైసీపీ, ఆర్‌జేడీ, జేడీయూ, ఎల్‌జేపీ అన్నీ తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కావాలని అడిగాయి” అని ఆయన అన్నారు.

జేడీయూ ఎంపీ సంజయ్ ఝా మాట్లాడుతూ “మేము బీహార్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ సమస్యను చాలా కాలంగా లేవనెత్తుతున్నాం. ఇందులో ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే, మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి” అని అన్నారు.

త‌మ గొంతు వినిపించేందుకు అవ‌కాశం ఇవ్వాలి- ప్రతిప‌క్షాలు

పార్లమెంట్ వేదికగా తమ గొంతు వినిపించేందుకు అవకాశం ఇస్తారన్న భరోసా కల్పించాలని ప్రతిపక్షాలు కోరాయి. అలాగే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి.‌ సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం ప్రభుత్వం అఖిల‌పక్ష స‌మావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్షాలు నీట్‌ పేపర్ లీక్‌, నిరుద్యోగం, ధ‌ర‌లు పెరుగుద‌ల‌, అగ్నివీర్ ప‌థ‌కం ర‌ద్దు, లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి, కన్వయర్‌ యాత్ర వివాదం వంటి పలు అంశాలను లేవనెత్తాయి.

ప్రతిప‌క్షాల‌కు లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వండి

పార్లమెంట్ స‌మావేశాల నిర్వహ‌కు స‌హ‌క‌రించాల‌ని ప్రభుత్వం అన్ని ప‌క్షాల‌ను కోరింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం కావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరిన తర్వాత పార్లమెంటులో సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలను అనుమతించాలని కాంగ్రెస్ ‌నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని, ఈ పదవిని ఖాళీగా ఉంచడం సమంజసం కాదని సూచించారు.

ఈ అఖిల ప‌క్ష స‌మావేశంలో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్‌ రిజిజు హాజరు కాగా, కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్‌, కె. సురేష్‌ హాజరయ్యారు. సీపీఎం జాన్ బ్రిట్టాస్, ఎల్‌జేపీ నేత, కేంద్ర మంత్రులు చిరాగ్‌ పాశ్వాన్‌, ఎస్‌పీ ఎంపీ రాం గోపాల్‌ యాదవ్‌, ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఓవైసీ, ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌, ఆర్‌జేడీ ఎంపీ అభయ్ కుష్వాహ, జేడీయూ ఎంపీ సంజయ్ ఝా సహా పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

రేప‌టి నుంచి పార్లమెంట్ స‌మావేశాలు

రేప‌టి నుంచి పార్లమెంట సమావేశాలు మొదలుకానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నీట్ పేపర్ లీక్ కేసు నుంచి రైల్వే భద్రత వరకు సమస్యలపై ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇండియా కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 12 వరకు 19 రోజులు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను సమర్పించాలని, కేంద్ర బడ్జెట్, జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం పొందనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.

సమావేశం అనంతరం పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 44 పార్టీల నుంచి 55 మంది నేతలు సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. పార్లమెంట్ ను సజావుగా నడపడం ప్రభుత్వం, ప్రతిపక్షాల సమిష్టి బాధ్యతని ఆయన అన్నారు. పార్లమెంట్ నిబంధనలకు లోబడి ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా వివిధ శాఖల మంత్రులతో ఎంపీలు నేరుగా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలని అఖిలపక్ష భేటీలో కోరినట్లు ఆయన తెలిపారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం