BRS Ex Mla Car Accident : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి, కారు వదిలి పారిపోయే ప్రయత్నం!
BRS Ex Mla Car Accident : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. అయితే ఆ సమయంలో కారు రాజయ్య డ్రైవర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగి తర్వాత సహాయ చర్యలు చేపట్టకుండా... పరారయ్యేందుకు ప్రయత్నించారు.
BRS Ex Mla Car Accident : స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ కారు నడుపుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే కూడా అందులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన అనంతరం పారిపోయే ప్రయత్నం చేయడం గమనార్హం. దీంతో కొంతమంది యువకులు పట్టుకునే ప్రయత్నం చేయగా, కొంతదూరంలో ఆయన కారు వదిలి వేరే వాహనంలో వెళ్లిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన కలకోట స్వప్న(40) ఉపాధి కోసం కాజీపేట మండలం మడికొండ ప్రాంతానికి వచ్చి కొంతకాలంగా నివాసం ఉంటోంది. ఇక్కడే రోజువారీగా కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కూలి పని ముగించుకుని ఇంటి వెళ్తోన్న క్రమంలో కాజీపేట మండలం మడికొండ ఆర్ఎన్ఆర్ గార్డెన్ వద్ద ఎన్ హెచ్-163పై రోడ్డు డివైడర్ దాటుతోంది. అదే సమయంలో ఆ మార్గంలో వచ్చిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కారు ఆమెను అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వప్న తలకు బలమైన గాయాలు కాగా స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన పడిపోయింది. దీంతో గమనించిన స్థానిక యువకులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం వారు అక్కడికి చేరుకోగా, బాధితురాలిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆమెను పరీక్షించిన అక్కడి డాక్టర్లు స్వప్న అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.
పారిపోయే ప్రయత్నం!
ప్రమాదం జరిగిన సమయంలో రాజయ్య డ్రైవర్ కారు నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే కారులో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఉండగా, ప్రమాదం జరిగిందని తెలిసి కూడా ఆయన కారు ఆపకుండా వెళ్లిపోవడం విమర్శలకు తావిచ్చింది. కాగా ప్రమాదాన్ని గమనించిన కొందరు యువకులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. ఇంకొందరు మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు మహిళను ఢీకొట్టి వెళ్లిపోయిందని, దానిని వెంటనే పట్టుకోవాల్సిందిగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన చోటు నుంచి కొంతదూరం అలాగే ముందుకు వెళ్లి.. కాజీపేట బాపూజీ నగర్ వద్ద కారును వదిలేసి రాజయ్య, ఆయన డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మడికొండ పోలీసులకు తన సెక్రెటరీ ద్వారా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన చోట ఆమెను రక్షించేందుకు చర్యలు చేపట్టాల్సిన మాజీ ఎమ్మెల్యే.. అక్కడి నుంచి పరారవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా మృతురాలికి భర్త, కుమారుడు ఉండగా, బతుకుదెరువు కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయినట్లయ్యిందని బాధిత కుటుంబ సభ్యులు రోధించారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం