తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  బాబుకు వ్యూహకర్తలు ఎక్కువయ్యారా....?

బాబుకు వ్యూహకర్తలు ఎక్కువయ్యారా....?

HT Telugu Desk HT Telugu

08 May 2022, 10:40 IST

google News
    • తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సలహాలిచ్చే వ్యూహకర్తలు ఎక్కువైపోయారని ఆ పార్టీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు. పార్టీకి జవసత్వాలు కల్పించడానికి ఒకరికి ఇద్దరు కన్సల్టెంట్లను నియమించుకోవడంతో చంద్రబాబు ఎవరి మాట వింటున్నారో తెలీక ఆ పార్టీ నేతలు జుట్లు పీక్కుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులో ఈ మధ్య ఉత్సాహం పెరిగింది. అధికారంలోకి వచ్చేందుకు ఒకరికి ఇద్దరు వ్యూహకర్తల్ని నియమించుకోవడంతో 2024లో గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఆస్థానంలో ఉన్న ఇద్దరు వ్యూహకర్తలకు ఒకరంటే ఒకరికి పడకపోవడం రచ్చకు కారణమవుతోంది. ఎవరికి వారు చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో పార్టీలో గందరగోళానికి కారణమవుతున్నారు.

అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు వ్యూహకర్తల బాట పట్టడంతో తెలుగుదేశం పార్టీ కూడా రెండేళ్ల క్రితమే ఓ వ్యూహకర్తను పార్టీ కోసం నియమించుకుంది. గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసిన రాబిన్‌ శర్మ సొంత కుంపటి పెట్టుకుని చంద్రబాబును క్లయింట్‌గా మార్చుకున్నాడు. రాబిన్‌ శర్మ ఏమి చెప్పారో, చంద్రబాబుకు ఏమి నచ్చిందో కానీ రెండేళ్లకు పైగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌కు సునీల్ కనుగోలు కన్సల్టెంట్‌గా నియమితులయ్యారు.

సునీల్‌ గతంలో శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలకు సేవలందించారు. పీకే టీం నుంచి వేరుపడిన రాబిన్‌, సునీల్‌ ఇద్దరు చంద్రబాబుకు రాజకీయ వ్యూహాలు, లెక్కలు, ఎక్కాలు నేర్పిస్తున్నారు. నిజానికి వీరిద్దరికి అంత సఖ్యత లేదనే సంగతి బయట కన్సల్టెంట్లలో విస్తృత ప్రచారంలో ఉంది. రాజకీయ వ్యూహం అనేది ఫక్తు వ్యాపారం కావడంతో ఒకరి క్లయింట్‌ వ్యాపారంలోకి మరొకరు ప్రవేశించడాన్ని సహించలేకపోతున్నారు. ఇప్పుడు ఒకే వ్యాపారంలో ఉన్న ఇద్దరు వ్యూహకర్తలు చంద్రబాబు దగ్గరే ఉండటంతో బాబు ఎవరి మాట వింటున్నారనే సందేహం నేతల్ని పట్టి పీడిస్తోంది.

షో టైమ్ రాబిన్ శర్మ, మైండ్ షేర్ అనలటిక్స్‌ సునీల్ కనుగోలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన సునీల్ అమెరికాలో చదువుకుని కొన్నాళ్లు ఐపాక్‌లో పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు అసోసియేషన్‌ ఆఫ్‌ బ్రిలియంట్ మైండ్స్‌ పేరుతో కన్సల్టెంట్‌గా పనిచేశారు. బీజేపీ గెలుపు వెనుక ఈ సంస్థ పాత్ర కూడా గణనీయంగా ఉంది. తమిళనాడులో స్టాలిన్‌కు, కొన్నాళ్లు ఏఐడిఎంకెకు, బీహార్‌లో నితీష్‌కు పనిచేసిన అనుభవం ఉన్నా, సక్సెస్‌ రేటు మాత్రం పెద్దగా లేదు. డేటా అనాలసిస్, వ్యూహరచన, బూత్‌లెవల్ పోల్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో అనుభవం ఉంది. అయితే చంద్రబాబు నియమించుకున్న ఇద్దరు వ్యూహకర్తలు అసలు ఆయనకు ఏమి చెబుతున్నారో తెలీక సీనియర్లు గందరగోళానికి గురవుతున్నారు. అభ్యర్ధుల ఎంపిక వెనుక ఫీడ్‌ బ్యాక్‌ అందించే విషయంలో స్ట్రాటజిస్ట్‌ల పైనే బాబు ఆధారపడుతున్నారు. అయితే అవి సీనియర్లకు ఏమాత్రం రుచించడం లేదు. చీరాలలో కొండయ్య యాదవ్‌ నియామకం, బాపట్లలో వేగెశ్న నరేంద్ర వర్మల నియామకాన్ని ఉదహరిస్తున్నారు. పార్టీ నేతలతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక వ్యూహకర్తల సలహాలు ఉండి ఉంటాయని అనుమానం నేతల్లో బలంగా ఉంది.

పార్టీ స్థానిక పరిస్థితుల గురించి అధినేతను అప్రమత్తం చేసే విషయంలో సమన్వయం కొరవడుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు పర్యటనలు, ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలు, ప్రభుత్వ వైఫల్యం వల్లే తప్ప మిగిలిన వారి ప్రమేయం పెద్దగా లేదని చెబుతున్నారు. గత వారం పదిరోజుల్లో చోటు చేసుకున్న ఘటనలపై టీడీపీ ఉధృత పోరాట కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చిన పార్టీ క్యాడర్‌ను మరింత ఉత్సాహపరిచేలా వ్యూహాలు కనిపించడం లేదని నేతలు గుసగుసలాడుతున్నారు.

తదుపరి వ్యాసం