CM Jagan Review : అంగన్వాడీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయండి
20 April 2023, 16:22 IST
- CM Jagan Latest News: ఖాళీగా ఉన్న అంగన్‌వాడి వర్కర్లు, హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై సమీక్షించిన ఆయన.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
సీఎం జగన్ సమీక్ష
CM Jagan On Women and Child Welfare Department: తాడేపల్లిలోని క్యాంపు కార్యలయంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. అంగన్‌వాడీ సెంటర్లలోని సదుపాయాలపై ఆరా తీశారు. ఇప్పటివరకు ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని సూచించారు.
ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకు పైగా అంగన్‌వాడీల్లో పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. మిగిలిన సుమారు 45వేల అంగన్‌వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలని... ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేయాలని సూచించారు. వీటిపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలని...గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు.
క్రమం తప్పకుండా అంగన్‌వాడీలపై పర్యవేక్షణ జరగాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. సంపూర్ణ పోషణ పంపిణీ సమర్థవంతంగా చేయాలని సూచించారు. అంగన్‌వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలించాలని... అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.