CM Jagan Review: ప్రతినెలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్ చేయాలి - సీఎం జగన్
30 September 2022, 19:03 IST
- cm ys jagan review : తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం జగన్ సమీక్ష
cm jagan review on health dept: ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సి స్థాయిలో సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్. ఇవాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖపై సమీక్ష చేపట్టిన ఆయన.. పలు అంశాలపై సూచనలు చేశారు. ఆస్పత్రుల్లో ప్రతినెలా ఆడిట్ చేయాలని ఆదేశించారు. ఈ ఆడిట్ నివేదికలు ప్రతి నెలాకూడా అధికారులకు చేరాలన్నారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్న ముఖ్యమంత్రి... ఎక్కడ ఖాళీ వచ్చినా జాప్యం లేకుండా మరొకరిని వెంటనే నియమించాలని తెలిపారు.
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ డైట్ ఛార్జీలను పెంచాలన్నారు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే.. రోజుకు రూ.100కు పెంచాలన్న ఆయన.. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ద్వారా డైట్ అందించాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించిన ఆయన.. మెడికల్ కాలేజీల నిర్మాణపనులపై మరింత ధ్యాస పెట్టాలని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్ల స్టై ఫండ్ పెంపుపైనా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంపై సీఎం సమీక్షించారు. అయితే జాబితాలోకి చేరాల్సిన కొత్త చికిత్సల ప్రక్రియ పూర్తి అయిందని... కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కొంత సమయం కావాలని అధికారులు కోరగా... సీఎం జగన్ అంగీకరించారు. ఇంతకుముందు అనుకున్నట్లు అక్టోబరు 5వ తేదీ బదులు.. అక్టోబరు 15న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్టు కూడా ప్రారంభం కానుంది.
ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పని చేస్తోందని గుర్తు చేశారు సీఎం జగన్.ప్రస్తుతం ఉన్న వాహనాలతో పాటు మరో 432 కొత్త 104 వాహనాలు డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దీంతో ఇప్పటికే సేవలందిస్తున్న 676 వాహనాలకు తోడుగా మొత్తంగా ఆ సంఖ్య 1,108కి చేరనుంది. అలాగే ఇప్పటికే సేవలందిస్తున్న 748, 108-వాహనాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మరోవైపు విలేజ్ క్లినిక్స్ లో కోవిడ్ కిట్ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ సూచించారు.
మరోవైపు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం నుంచి అవార్డులు రావటంపై ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు.