CM Chandrababu On Laddu Row : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ విచారణ, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
22 September 2024, 22:21 IST
- CM Chandrababu On Laddu Row : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐజీ, ఆపైస్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నివేదికను బట్టి, బాధ్యులని కఠినంగా శిక్షిస్తామన్నారు. వైసీపీ టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని విమర్శించారు
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ విచారణ, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
CM Chandrababu On Laddu Row : గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారన్నారు. భక్తుల మనోభావాలకు విలువ లేకుండా చేశారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలని వాడుకున్నారన్నారు. స్వామి వారంటే నమ్మకం లేని వారిని అక్కడ ఛైర్మెన్లుగా పెట్టారని, టీటీడీ బోర్డు అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. తిరుమలను అన్ని విధాలుగా అపవిత్రం చేశారన్నారు. 5 ఏళ్లలో తిరుమల లడ్డూ ఎలా ఉండేదో అందరికీ తెలుసని, మూడు రోజుల్లో లడ్డూ చెడి పోవటం, సువాసన లేకపోవటం, రంగు కూడా తేడాగా ఉండటం, ఇవన్నీ అందరికీ తెలిసిందే అన్నారు.
"నేను ప్రమాణస్వీకారం చేస్తూనే, టీటీడీ ఈవోని అపాయింట్ చేసి, తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టాలని ఆదేశించాను. ఆయన పని మొదలుపెట్టారు. నాసిరకం నెయ్యి పంపిస్తున్నారని డౌట్ వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా వినలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో, తిరుమల కొండపై కూడా కక్కుర్తి పడ్డారు. తమ వారికి ఇచ్చుకోవటానికి, కమిషన్ల కక్కుర్తి కోసం, మొత్తం నిబంధనలు మార్చేశారు. చివరకు నెయ్యి ఉత్పత్తి సామర్ధ్యం లేని వారు కూడా టెండర్ లో పాల్గొనవచ్చని నిబంధనలు మార్చేశారు. నిబంధనలు అన్నీ సవరించి, వీళ్లకు కావాల్సిన వారికి ఇచ్చుకునే విధంగా చేశారు. దీని ప్రభావమే, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి"- సీఎం చంద్రబాబు
ఆ రేటుకు డాల్డా రావటం లేదు
నెయ్యిలో కల్తీ వచ్చిందని అనుమానం రాగానే, టెస్టింగ్ కి పంపించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉన్నాయని తేలిందన్నారు. వెంటనే సప్లైయర్ ను బ్లాక్ లిస్టులో పెట్టి, చర్యలు ప్రారంభించామన్నారు. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి, వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం కొత్త టెండర్స్ పిలిచారన్నారు. ప్రపంచంలో ఉండే హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. నెయ్యి కల్తీపై క్షమించమని అడగాల్సింది పోయి, ఇప్పటికీ ఎదురు దాడి చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ ఇలాగే తప్పుడు పనులు చేయటం, ఎదురు దాడి చేయటం వైసీపీకి అలవాటైందన్నారు.
'రూ.319.80కి డాల్డా రావటం లేదు, అలాంటిది నెయ్యి వస్తుందని ఎలా అనుకున్నారు?' అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దేవుడికి అపచారం చేయాలనేదే వీళ్ల అజెండా, ఆ రోజు పింక్ డైమండ్ అంటూ, లేని పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని, తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. దేవుడు కూడా మమ్మల్ని ఏమి చేయలేడనే అహంభావం వైసీపీ నేతల్లో ఉందన్నారు. లడ్డూ వ్యవహారంపై ఐజీ, ఆపైస్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామన్నారు. వాళ్లు విచారణ చేసి ఇచ్చే రిపోర్టును బట్టి, బాధ్యులని కఠినంగా శిక్షిస్తామన్నారు.
శాంతిహోమం నిర్వహణ
"స్వామివారి పవిత్రతను ఎవరూ మలినం చేయలేరు. మొత్తం ప్రక్షాళన చేసి, దేవుడికి తన పూర్వవైభవం తీసుకువద్దాం. ఇప్పటికే ఆగస్టు 15న జరిగిన తప్పునకు యాగం చేశారు. శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షణ చేస్తారు. యాగం చేయాలని ఆగమ సలహామండలి నిర్ణయించింది"- సీఎం చంద్రబాబు
'ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఏడాది వరకు స్వామి వారి దగ్గరకు వెళ్ళం. అలాంటిది కొడుకు చనిపోతే 11వ రోజు దేవాలయానికి వస్తారా? స్వామి వారంటే నమ్మకం అని ఏ నాడైనా జగన్ డిక్లరేషన్ ఇచ్చారా? అబ్దుల్ కలాం లాంటి వారే ఇచ్చారే, జగన్ వాళ్లకంటే గొప్ప వాడా? సుబ్బారెడ్డి ఎవరు ? భూమన ఎవరు? సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం కూతురి పెళ్లి చేశారు. సంప్రదాయాలు, నమ్మకాలు ఉండవా? టీటీడీకి ఛైర్మన్‌గా ఉండి, 3.75 లక్షల టికెట్లు ఇచ్చుకున్నాడు. చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి వారిని చూశామా?' అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
ప్రధానికి జగన్ రాసిన లేఖలో మొత్తం అబద్ధాలే ఉన్నాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. తిరుమలలో విధ్వంసం చేసి, తన పాత్ర ఏమీ లేదని ప్రధానికి లేఖ రాశారన్నారు. అసలు తిరుమలలో పూర్తి స్థాయిలో కల్తీని టెస్ట్ చేసే వ్యవస్థే లేదన్నారు. ఏ ప్రార్థనా మందిరంలో అయినా, ఆ మతం వాళ్లే బోర్డులో ఉండాలని, వాళ్లే మ్యానేజ్ చేయాలన్నారు. ఇతర మతాల వారు ఉండటానికి వీల్లేదన్నారు. దేవాలయాలు అయినా, చర్చిలు అయినా, మసీదులు అయినా, ఆ మతం వాళ్లే ఉండాలని, అవసరం అయితే ప్రత్యేకమైన చట్టం కూడా తెస్తామన్నారు.