Yamini Krishnamurthy : ప్రముఖ భరతనాట్యం కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
03 August 2024, 19:32 IST
- Yamini Krishnamurthy : ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు.
ప్రముఖ భరతనాట్యం కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
Yamini Krishnamurthy : ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వయస్సురీత్యా అనారోగ్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచారు.
యామినీ కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎంతో పేరు తెచ్చిపెట్టారు. కర్ణాటక సంగీతం నేర్చుకుని, పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. యామినీ కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబరు 20న జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. అనంతరం వీరి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడ్డారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం పొందిన యామినీ.. 1957లో తన తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతలు పొందారు. భారతప్రభుత్వం యామినీ కృష్ణమూర్తికి పద్మ శ్రీ(1968), పద్మ భూషణ్(2001), పద్మ విభూషణ్(2016) అవార్డులతో సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా సేవలందించారు.
యామినీ పూర్తి పేరు యామినీ పూర్ణతిలకం. తన తండ్రి ప్రోత్సాహంతో 5వ ఏట చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. అనంతరం కూచిపూడి, ఒడిస్సీ నేర్చుకున్నారు. ఎం.డి.రామనాథన్ దగ్గర కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకున్నారు. యామినీ తన తొలిప్రదర్శనను తన 17వ ఏట 1957 చెన్నైలో ఇచ్చారు. ఈమెకు 20 ఏళ్లు వచ్చే సమయానికి ప్రతిభావంతురాలైన నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, మయన్మార్ వంటి దేశాల్లో యామినీ కృష్ణమూర్తి నృత్య ప్రదర్శనలిచ్చి, భారతీయ నాట్య ప్రచారం చేశారు. దిల్లీలో నృత్యకౌస్తుభ కల్చరల్ సోసైటీ యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. భారతీయ నాట్యానికి యామినీ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా శాంభవి స్కూల్ ఆఫ్ డాన్స్ సంస్థ యామినీకి నాట్య శాస్త్ర పురస్కారాన్ని అందించింది. న్యూదిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు ఈమె డైరెక్టరుగా సేవలు అందించారు. ఈమె వివాహం చేసుకోకుండా నాట్యరంగానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు.