తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Victory In Andhra: ఎన్నికలకు ముందే బీజేపీ నెగ్గినట్టేనా..! ఏపీలో బలనిరూపణే అసలు లక్ష్యమా..

BJP Victory In Andhra: ఎన్నికలకు ముందే బీజేపీ నెగ్గినట్టేనా..! ఏపీలో బలనిరూపణే అసలు లక్ష్యమా..

Sarath chandra.B HT Telugu

11 March 2024, 10:06 IST

google News
    • BJP Victory In Andhra: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే బీజేపీ రాజకీయంగా నెగ్గింది. టీడీపీ-జనసేనతో కలిసి కూటమిగా జట్టు కట్టడంలో బీజేపీ  పై చేయి సాధించింది. బీజేపీతో జట్టు కట్టడానికి టీడీపీ-జనసేనలు చివరి నిమషం వరకు వేచి చూసేలా చేయడంలో ఆ పార్టీ నైతికంగా విజయం సాధించింది.
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ విజయం సాధించినట్టేనా?
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ విజయం సాధించినట్టేనా?

బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ విజయం సాధించినట్టేనా?

BJP Victory In Andhra: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సొంతంగా ఎదగాలని గత కొన్నేళ్లగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఎన్నికల వేళ అనూహ్యంగా మళ్లీ పాత మిత్రులతో జట్టు కట్టింది. 2014 ఎన్నికల్లో ఏ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందో అదే పార్టీలతో పదేళ్ల తర్వాత మళ్లీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బీజేపీ చివరి నిమిషం వరకు రాజకీయంగా పైచేయి ప్రదర్శిస్తూనే వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బీజేపీ BJP బలం ఎంత అంటే, పొరుగున ఉన్న తెలంగాణతో పోలిస్తే తక్కువే అన్నది మాత్రం నిర్వివాదంశం. ఏపీలో బీజేపీకి సైద్ధాంతికంగా బలమైన మద్దతుదారులు ఉన్నా, రాజకీయాల్లో సొంతంగా అభ్యర్ధులను గెలిపించుకునే స్థాయిలో మాత్రం లేదు. అందుకే కనీసం కార్పొరేటర్లుగా కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవనే విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చేది.

బీజేపీ ఆవిర్భావం నుంచి నలభై ఏళ్లలో దేశంలో 2 పార్లమెంటు స్థానాల నుంచి సొంతంగా దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగినా ఏపీలో మాత్రం ఆ పార్టీ ఎందుకు ఎదగలేక పోయిందనే చర్చ పలు మార్లు చర్చకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం TDP పార్టీ నీడలో ఉండిపోవడం వల్లే ఏపీలో బీజేపీ ఎదగలేదనే విమర్శ ఉంది. 2018లో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నా తర్వాత మళ్లీ ఆ పార్టీతో జట్టు కట్టేది లేదని బీజేపీ ప్రకటించింది. అయితే అనూహ్యంగా 2024 నాటికి ఆ రెండు పార్టీలు మళ్లీ జట్టు Alliance కట్టాయి.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు 117 స్థానాల్లో పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిచోట డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్రంలో పోలైన ఓట్లలో బీజేపీకి కేవలం 0.85శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేనకు 7శాతం లోపు ఓట్లు వచ్చాయి.

నెగ్గిన బీజేపీ పంతం...

ఏపీల సొంతంగా ఎదగడానికి ఐదేళ్లలో బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది. ఏపీలో కమ్మ సామాజిక వర్గం టీడీపీకి, రెడ్లు వైసీపీ వైపు ఉండటంతో మూడో బలమైన సామాజిక వర్గం కాపుల్ని ఆకర్షించేందుకు వారికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. మొదట కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత సోము వీర్రాజులకు బాధ్యతలు అప్పగించారు. ఐదేళ్ల తర్వాత అనూహ్యంగా దగ్గుబాటి పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

ఏపీ బీజేపీలో సిద్దాంతపరంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల బీజేపీ వర్గంతో పాటు టీడీపీ అనుకూల వర్గం ఒకటి, వైసీపీ అనుకూల వర్గం ఇంకోటి ఉన్నాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ 2019 ఫలితాలు పునరావృతం అవుతాయనే అవగాహన కూడా బీజేపీ పెద్దలకు ఉంది.

అదే సమయంలో టీడీపీతో జత కలిసే విషయంలో కూడా బీజేపీ నేతల్లో బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఎన్డీఏలో మిత్రపక్షంగా లేకున్నా మోదీ మాట జవదాటని పార్టీగా నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమితో కలిసి పోటీ చేయడం ద్వారా బీజేపీ వీలైనన్ని పార్లమెంటు స్థానాలలను దక్కించుకోవాలని భావిస్తోంది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాతినిథ్యం ఉండాలనే లక్ష్యంతోనే టీడీపీ-జనసేన Janasena కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. గెలుపొటములు, సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఏపీలో గెలిచే స్థానాలన్నీ తమకే దక్కుతాయనే అంచనాతో బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ Andhrapradesh నుంచి బీజేపీ సొంతంగా గెలిచే స్థానాలతో పాటు మిగిలిన పార్టీలు గెలిచే స్థానాలు కూడా తమ చెప్పు చేతల్లోనే ఉంటాయనే అంచనా బీజేపీకి ఉంది.

ఎన్డీఏ NDA కూటమిలోకి టీడీపీ మళ్లీ చేరినా బీజేపీకి ఉన్న బలం నేపథ్యంలో మునుపటి వైభవం టీడీపీకి దక్కడం సందేహమే అవుతుంది. ఐదేళ్లలో ఏపీలో సొంతంగా ఎదగాలనుకున్న బీజేపీ పెద్దల ఆశలు ఏదో రూపంలో నెరవేరినట్టేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏమవుతుందో కూడా చెప్పలేమని, ఏదొక పార్టీ బీజేపీలో అస్తిత్వాన్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి కూడా రావొచ్చని ఓ బీజేపీ సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.

తదుపరి వ్యాసం