APSRTC Temple Tour : భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్, రాజమండ్రి నుంచి నవజనార్దనస్వామి ఆలయాలకు ప్రత్యేక బస్సులు
23 December 2024, 15:21 IST
APSRTC Temple Tour : ఏపీఎస్ఆర్టీసీ పుణ్యక్షేత్రాలు తిరిగే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ధనుర్మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి "నవజనార్దన పారిజాతాలు" పేరుతో స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాత్రలో ఒకే రోజు 9 పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు.
భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్, రాజమండ్రి నుంచి నవజనార్దనస్వామి ఆలయాలకు ప్రత్యేక బస్సులు
APSRTC Temple Tour : పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) "నవజనార్దన పారిజాతాలు" పేరుతో పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమండ్రి నుంచి రాష్ట్రంలోని నవ జనార్దనస్వామి క్షేత్రాల దర్శనానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీస్‌ల వేసింది. ఈ సర్వీస్‌లను యాత్రికులు వినియోగించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ రాజమండ్రి డిపో మేనేజర్ ఎస్.కె షబ్నం సూచించారు.
ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణికులు, యాత్రికులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ఒకే రోజు రాష్ట్రంలోని తొమ్మిది క్షేత్రాలను దర్శనానికి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
సర్వీసులు అందుబాటులో ఉండే రోజులు
ధనుర్మాసంలో జనార్దన స్వామి ఆలయాలను దర్శించుకునేందకు "నవజనార్దన పారిజాతాలు" పేరుతో ప్రతి శని, ఆది, సోమవారాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఉదయం ఆరు గంటలకు బస్సు రాజమండ్రి ఆర్టీసీ డీపో నుంచి బయలుదేరుతోంది. తొమ్మిది క్షేత్రాలు దర్శించుకున్న తరువాత తిరిగి అదే రోజు రాత్రికి డిపోకు చేరుకుంటాయి. ధనుర్మాసం ముగిసే వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
నవజనార్దన పారిజాతాలు
భక్తులు దవళేశ్వరం (యుగముద్ర), మడికి (సుదర్శన ముద్ర), జొన్నాడ (అభయ ముద్ర), ఆలమూరు (ఉద్రముద్ర), మండపేట (భోగి ముద్ర), కపిలేశ్వరపురం (పద్మాసన ముద్ర), కోరుమిల్లి (సాదక ముద్ర), మాచర (జ్వాలా ముద్ర), కోటిపల్లి (సిద్ధ ముద్ర)లను సందర్శిస్తారు.
ప్యాకేజీ ఇదే
ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర రూ.300 ఉంటుంది.
టిక్కెట్లు ఇలా పొందాలి
టిక్కెట్లను రాజమండ్రి బస్‌స్టేషన్‌లో పొందవచ్చు. ఇతర వివరాల కోసం 9502300189, 7382912141, 9959225535 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని రాజమండ్రి డిపో మేనేజర్ ఎస్.కె షబ్నం తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు