AP Temples Tour : పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు, కృష్ణా జిల్లాలో 200 ఆర్టీసీ స్పెషల్ బస్సులు
26 October 2024, 19:13 IST
AP Temples Tour : రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. కృష్ణా జిల్లాలోనే ఏకంగా 200 బస్సులు ఆర్టీసీ పుణ్యక్షేత్రాల దర్శనాలకు కోసం వేసింది.
పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు, కృష్ణా జిల్లాలో 200 ఆర్టీసీ స్పెషల్ బస్సులు
కార్తీక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది 150 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురాగా, ఈ ఏడాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని డిపోల నుంచి 200 స్పెషల్ సర్వీసులు నిర్వహించేందుకు నిర్ణయించారు. నవంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే కార్తీకమాసం నిమిత్తం ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకుకొచ్చారు. పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించేవారి కోసం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుపుతున్నారు.
ప్రతి ఆదివారం అరుణాచలం దర్శించుకునే విధంగా అన్ని డిపోల పరిధి నుంచి సర్వీసులు నిర్వహిస్తారు. యాగంటి, మహానంది, శ్రీశైలం పుణ్యక్షేత్రాలను రోజున్నర వ్యవధిలో సందర్శించకునేలా త్రిలింగ దర్శిని ప్యాకేజీ అమలు చేస్తున్నారు. వీటితో పాటు మంత్రాలయం, వాడపల్లి తదితర ప్రాంతాలకు అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నిర్వహించనున్నారు.
ఏ డీపో నుంచి ఎన్ని బస్సులు
పుణ్యక్షేత్రాల దర్శనం కోసం అవనిగడ్డ డిపో నుంచి 38, గుడివాడ డిపో నుంచి 50, మచిలీపట్నం డిపో నుంచి 70, గన్నవరం డిపో నుంచి 23, ఉయ్యూరు డిపో పరిధి నుంచి 19 ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు, ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు అవనిగడ్డ డిపో 9959225466, గన్నవరం డిపో 8790996090, గుడివాడ డిపో 9959225464, మచిలీపట్నం డిపో 9959225462, ఉయ్యూరు డిపో 9959224796, నంబర్లను సంప్రదించవచ్చు. బృందాలుగా వెళ్లాలనుకునే భక్తులకు అద్దె ప్రాతిపదికన ఏసీ, స్టార్ లైనర్, సూపర్ డీలక్స్ బస్సులు ఇవ్వనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి ఎ.వాణిశ్రీ తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు