Mandous Cyclone: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
09 December 2022, 21:29 IST
- APSDMA Latest Alerts: తీవ్ర తుపానుగా మారిన మాండూస్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మాండూస్ తుఫాన్ అప్డేట్స్
Mandous Cyclone Latest Updates: మాండూస్ తుపాన్... రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అధికారులు ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. తుపాన్ ప్రభావంపై ఏపీ విపత్తుల శాఖ (Andhra Pradesh State Disaster Management Authority) అప్డేట్ ఇచ్చింది. తుఫాన్ ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 280కి.మీ., మహాబలిపురంకు 90 కి.మీ., చెన్నైకి 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ఈ ప్రభావంతో శనివారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ పేర్కొంది. తుఫాన్ తీరం దాటినప్పటికి రేపు, ఎల్లుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాల్లో ఒకటి, నెల్లూరు జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 మొత్తం 5 ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.అలాగే ప్రకాశం, నెల్లూరు,తిరుపతి,చి త్తూరు జిల్లాలో ఒకటి వంతున మొత్తం 4 ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచారు. వర్షాలు,భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు లేదా ఇతర కమ్యునికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకునేలా సర్వసన్నద్ధమై ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకున్నారు.
బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయకారిగా నిలవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.