Mandous Meaning: మాండూస్ తుపాన్ అర్థమేంటి.. పేరు ఎవరు పెట్టారు?
Mandous Meaning: దూసుకొస్తున్న మాండూస్ తుపాను భయపెట్టిస్తుంది. ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందోనని ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇంతకీ మాండూస్ అంటే అర్థం ఏంటి? ఈ పేరు ఎవరు పెట్టారు?
Mandous Meaning: బంగాళాఖాతం(Bay Of Bengal)లో కొనసాగిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. దీంతో ఎంతటి నష్టం ఉంటుందోనని భయం మెుదలైంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ప్రభావం చూపించనుంది. దీంతో వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. డిసెంబర్ 9న తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఈ తుపానుకు మాండూస్ అని ఎవరు పేరు పెట్టారు..? అర్థం ఏంటి..?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఈ పేరును సూచించింది. అరబిక్‌లో మాండూస్(Mandous) అంటే 'నిధి పెట్టె' అని అర్థం. దీనిని 'మాన్-డౌస్' అని కూడా ఉచ్ఛరిస్తారు. ఈ మేరకు మాండూస్ అని యూఏఈ నామకరణం చేసింది.
తుపానులకు పేరు పెట్టేందుకు.. ప్రత్యేకంగా ఓ సిస్టమ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో భారత వాతావరణ విభాగం కూడా ఒకటి. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలోని ఉత్తర భాగంలో ఏర్పడే తుపానులకు ఇండియాపేరు పెట్టాలి.
ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ, ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం.. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ తుపానులు ఉండే అవకాశం ఉంది. గందరగోళాన్ని నివారించడానికి ప్రతి తుపాను(Cyclone)కు పేరు పెడతారు.
అందుకోసమే.. పేర్లు పెట్టేడం ఓ పద్ధతి ప్రకారం జరుగుతాయి. బంగ్లాదేశ్(Bangladesh), ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ(UAE), యెమెన్ సభ్య దేశాలు 169 పేర్లు సూచించాయి. ఒక్కో దేశం 13 పేర్లను పంపింది. వాటిని ఆర్డర్లో ఏర్పాటు చేసి.. ఒకదాని తర్వాత మరొకటిని ఉపయోగిస్తారు.
సంక్షిప్తంగా, సులభంగా ఉచ్ఛరించే పేర్లను పెడతారు. తుపాను సమాచారాన్ని వేగంగా, సమర్థవంతంగా తెలిపేందుకు పేరు ఉపయోగపడుతుంది. లింగం, రాజకీయాలు, మత విశ్వాసాలు, సంస్కృతులకు ఎలాంటి భంగం కలగకుండా పేర్లు ఉండాలి. వాటి ప్రకారమే జాబితా తయారు చేస్తారు.
పేరును ఒకసారి ఉపయోగించిస్తే... మళ్లీ అది తిరిగి ఉపయోగించకూడదు. పేరు ఏ సభ్య దేశానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏ సమూహ జనాభా మనోభావాలను దెబ్బతీయకుండా.. జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పేరు ఇంగ్లీషు(English)లో ఎనిమిది అక్షరాలకంటే ఎక్కువ ఉండొద్దు. పేరు ప్రతిపాదించడంతోపాటు దాని స్పెల్లింగ్, ఉచ్ఛారణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదే. ఇప్పుడు వచ్చిన తుపానుకు మాండూస్(Mandous) అని యూఏఈ పేరు పెట్టింది.