తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Wine Shop Tenders 2024 : ఏపీలో వైన్స్ షాపులకు ముగిసిన దరఖాస్తులు - టాప్ లో ఎన్టీఆర్ జిల్లా, 14న లాటరీ

AP Wine Shop Tenders 2024 : ఏపీలో వైన్స్ షాపులకు ముగిసిన దరఖాస్తులు - టాప్ లో ఎన్టీఆర్ జిల్లా, 14న లాటరీ

11 October 2024, 19:41 IST

google News
    • ఏపీలో వైన్స్ షాప్స్ లైసెన్స్‌లకు సంబంధించిన దరఖాస్తుల గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. 87,116  దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1700కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దరఖాస్తుల్లో ఎన్టీఆర్‌ జిల్లా టాప్ లో ఉంది.
ఏపీలో ముగిసిన ముద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు
ఏపీలో ముగిసిన ముద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు

ఏపీలో ముగిసిన ముద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు

ఏపీలో మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన గడువు శుక్రవారం రాత్రి 7 గంటలతో పూర్తి అయింది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు… 87,116వేలలోపు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఫలితంగా ఏపీ ప్రభుత్వానికి రూ.1700 కోట్లకు పైగా ఆదాయం సమాకురింది.

ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యధికం…

మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల్లో ఎన్టీఆర్‌ జిల్లా టాప్ లో ఉంది. అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 113 మద్యం షాపులకు 5,704 దరఖాస్తులు అందాయి. శ్రీసత్యసాయి జిల్లాల్లో 1399 దరఖాస్తులు అందాయి. తిరుపతి జిల్లాల్లో 3659 అప్లికేషన్లు వచ్చాయి. అల్లూరి జిల్లాల్లో అత్యల్పంగా 1179 దరఖాస్తులు రాగా…విశాఖ జిల్లాలో 3890 దరఖాస్తులు వచ్చాయి.

అక్టోబర్ 14వ తేదీన లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేస్తారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు మద్యం దుకాణాలను ప్రారంభించుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పాలసీ సెప్టెంబరు 30వ తేదీన 2026 వరకు అమల్లో ఉంటుంది. మొత్తం 3396 వైన్ షాపులకు లైసెన్సుల జారీకి దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 14వ తేదీన 3396 షాపులకు లాటరీ తీస్తారు. దరఖాస్తుదారులు రూ.2 లక్షలు రుసుము చెల్లించారు. లైసెన్స్‌ ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షలు వరకు నిర్ణయించారు.

మొదటి ఏడాది 10 వేల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు లైసెన్స్ రుసుం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 5 లక్షల వరకు జనాభా ఉంటే లైసెన్స్‌ ఫీజు 65 లక్షలు.. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.85 లక్షలుగా లైసెన్సు రుసుమును చెల్లించాలి. రెండో సంవత్సరం ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచుతారు.

లైసెన్స్ పొందిన వారు ఆరు విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించవచ్చు. మద్యం రిటైల్‌ వ్యాపారం చేసే లైసెన్స్ దారులు 20 శాతం మేర మార్జిన్‌ ఇస్తారు. గతంలో 10 శాతం మార్జిన్ ఇచ్చేవారు. అన్ని బ్రాండ్లు ఉండేలా పారదర్శక మద్యం పాలసీ అందిస్తున్నామని ఎక్సైజ్ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.

వైన్ షాపుల డ్రా ఎలా తీస్తారు..?

  • అక్టోబర్ 14 తేదీన లాటరీ (డ్రా) తీయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో లాటరీ తీస్తారు.
  • జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో డ్రా తీస్తారు. మీడియా ప్రతినిధులకు కూడా అనుమతి ఉంటుంది.
  • జిల్లాలో ఉన్న వైన్ షాపుల సీరియల్ నంబర్ ఆధారంగా డ్రా తీయడం మొదలు పెడతారు. ఎవరు ఎక్కువ కోడ్ చేస్తే.. వారికి వైన్ షాప్ దక్కినట్టు ప్రకటిస్తారు.
  • లాటరీ బాక్స్‌లలో షాప్‌ల నంబర్లు, వాటికి కోడ్ చేసిన వారి వివరాలు ఉంటాయి. షాప్ దక్కించుకున్న వారి వివరాలను అధికారులు ప్రకటిస్తారు.
  • రెండేళ్ల కాల వ్యవధికి వీటిని కేటాయిస్తారు. మద్యం దుకాణాన్ని దక్కించుకున్నవారు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. లేకపోతే రద్దు చేస్తారు.
  • ప్రభుత్వం నోటిఫై చేసిన షాపుల్లో 15 శాతం గౌడ కులస్తులకు కేటాయించారు. వారు ఆసక్తి చూపకపోతే.. వేరే వారికి కేటాయిస్తారు.
  • తొలుత నగరపాలక సంస్థలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, వాటి తర్వాత నగర పంచాయతీలు, ఆ తర్వాత గ్రామాల్లో ఉన్న షాపులకు సంబంధించి డ్రా తీసే అవకాశం ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం