AP Wine Shop Tenders 2024 : మద్యం దుకాణాల దరఖాస్తు గడువు 2 రోజులు పొడిగింపు... 14న లైసెన్సులు ఖరారు!
ఏపీలో లిక్కర్ దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… దరఖాస్తుల గడువు అక్టోబర్ 9తో పూర్తి కావాలి. అయితే ఈ గడువును ఏపీ ప్రభుత్వం రెండు రోజులు పొడిగించింది. అక్టోబర్ 14న లాటరీ తీస్తారు.
ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టితో గడువు పూర్తి కానుండగా… మరో రెండు రోజుల పాటు సమయాన్ని పెంచింది. దరఖాస్తుదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ గడువును అక్టోబర్ 11వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు.
16న కొత్త దుకాణాలు…!
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 9వ తేదీతోనే పూర్తి కావాలి. తాజా నిర్ణయంతో అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. గడువు పెంచటంతో అక్టోబర్ 14వ తేదీన లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేస్తారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు మద్యం దుకాణాలను ప్రారంభించుకోవచ్చు.
ఇప్పటికే ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పాలసీ సెప్టెంబరు 30వ తేదీన 2026 వరకు అమల్లో ఉంటుంది. మొత్తం 3396 వైన్ షాపులకు లైసెన్సుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకోవచ్చు. ఈ నెల 14వ తేదీన 3396 షాపులకు లాటరీ తీస్తారు. దరఖాస్తుదారులు రూ.2 లక్షలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షలు వరకు నిర్ణయించారు.
డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంక్ చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఒకవేళ డీడీ తీస్తే నేరుగా ఎక్సైజ్ కేంద్రాల్లో అందించాలి. ఈ నెల 14న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కొత్త షాపులకు లాటరీ తీసి, లైసెన్సులు కేటాయిస్తారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి లైసెన్స్ దారులు కొత్త షాపులను ప్రారంభించుకోవచ్చు.
41వేలకు పైగా దరఖాస్తులు…!
అక్టోబర్ 8 రాత్రి వరకు వరకు 41 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.826.96 కోట్ల ఆదాయం సమకూరింది. వైన్ షాపులు ఏర్పాటు చేసే ప్రాంతంలోని జనాభాను బట్టి లైసెన్స్ రుసుమును నాలుగు శ్లాబుల్లో ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
మొదటి ఏడాది 10 వేల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల వరకు జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు 65 లక్షలు.. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించారు. రెండో సంవత్సరం ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచుతారు.
లైసెన్స్ పొందిన వారు ఆరు విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించవచ్చు. మద్యం రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ దారులు 20 శాతం మేర మార్జిన్ ఇస్తారు. గతంలో 10 శాతం మార్జిన్ ఇచ్చేవారు. అన్ని బ్రాండ్లు ఉండేలా పారదర్శక మద్యం పాలసీ అందిస్తున్నామని ఎక్సైజ్ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం