AP Weather Report : ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో
23 December 2024, 22:34 IST
AP Weather Report : అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంగా రానున్న ఐఎండీ పేర్కొంది.
ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో
AP Weather Report : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో వాతావరణ ఒక్కసారిగా మారింది. పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ... నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరంలో కొనసాగుతోందని వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది డిసెంబర్ 24 నాటికి, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ఫలితంగా ఏపీలో రానున్న మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం వరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు పడే అవకాశం ఉందన్నారు.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
"అల్పపీడనం ప్రభావంతో రేపు(మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వైయస్సార్ , అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" -ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్తోందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. అయితే రెండు రోజులకు ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరంవైపు వస్తోంది. అల్పపీడనం మరో రెండ్రోజుల్లో వాయుగుండంగా మారుతోందని వెల్లడించారు.